హ్యామ్ రోడ్లపై మళ్లీ ప్రపోజల్స్‌‌ పంపండి..ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి వెంకట్‌‌ రెడ్డి ఆదేశం

హ్యామ్ రోడ్లపై మళ్లీ ప్రపోజల్స్‌‌ పంపండి..ఆర్ అండ్ బీ అధికారులకు మంత్రి వెంకట్‌‌ రెడ్డి ఆదేశం
  • ఈ ప్రాజెక్టులో 4 వేల కిలోమీటర్ల రోడ్లు రెన్యువల్‌‌ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (హెచ్‌‌ఏఎం– హ్యామ్) రోడ్ల ప్రాజెక్టులో మార్పులు చేయాలని అధికారులను ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిపాదనలు రెడీ చేయాలని, గత ప్రపోజల్స్‌‌లో లేని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం చివరి నాటికి అందజేయాలని, వచ్చే కేబినెట్‌‌లో వీటికి ఆమోదం తీసుకుంటామని చెప్పారు. 

సోమవారం హైదరాబాద్‌‌ ఎర్రమంజిల్‌‌లోని ఆర్ అండ్ బీ హెడ్ ఆఫీసులో హ్యామ్‌‌ రోడ్లపై మంత్రి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రాఫిక్ ఉన్న రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. హ్యామ్ ప్రపోజల్స్‌‌లో 10 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను కూడా తీసుకోవాలన్నారు. కనెక్టివిటీ కారిడార్‌‌‌‌ను మరింత పెంచాలని, దీంతో రూరల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. 

హ్యామ్‌‌లో సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్.. డబుల్ లేన్ నుంచి పీవుడ్ షోల్డర్స్ (10 మీటర్ల) రోడ్డు.. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ఫోర్ లేన్ రోడ్స్ కొన్ని హ్యామ్‌‌లో తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 4 వేల కిలోమీటర్ల రోడ్లు రెన్యువల్ చేస్తామని తెలిపారు. పాత రోడ్ల మెయింటెనెన్స్‌‌తో పాటు వాటిని బలోపేతం చేస్తామని చెప్పారు. ఇటీవల కాంట్రాక్టర్లతో అధికారులు నిర్వహించిన మీటింగ్‌‌లో లోకల్ కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని కోరడంతో మళ్లీ ప్రతిపాదనలు రెడీ చేయనున్నారు. 

రోడ్ల మరమ్మతులకు సీఎంను 100 కోట్లు అడుగుతా..

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం అత్యవసరంగా రూ.100 కోట్లు రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని మంత్రి వెంకట్‌‌ రెడ్డి తెలిపారు. వచ్చే రెండేండ్లల్లో హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, ప్రధాన బిల్డింగ్స్ అన్ని పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు. అలాగే, రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ భూ సేకరణలో భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా, కేంద్రం ప్రాజెక్టును ఆమోదించగానే టెండర్లను ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు ఓపెన్ చేయనున్నారు. రివ్యూ మీటింగ్‌‌లో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీ జయభారతి, సీఈలు మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, జిల్లాల ఎస్‌‌ఈలతో పాటు ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, రోడ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.