తెలంగాణ నుంచి కొత్త దర్శకులు రావాలి: ‘అరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ నుంచి కొత్త దర్శకులు రావాలి: ‘అరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి

‘‘ఏ రాష్ట్రానికైనా సినిమా ఇండస్ట్రీ అనేది గుండె లాంటిది. అలాంటి  సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి ఇంకా ఎంతోమంది నటీనటులు, దర్శకులు వచ్చే అవకాశం ఉంటుంది” అని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం మాదాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హోటల్‌‌‌‌లో జరిగిన ‘అరి’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌‌‌‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానపాత్రల్లో ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు.  అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న సినిమా విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని శాఖల కంటే నిర్మాతలకే రిస్క్ ఎక్కువ. అలాంటి రిస్క్ తీసుకుని ఇలాంటి ఓ మంచి చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్స్‌‌‌‌ను అభినందిస్తున్నాను.

ఇక దర్శకుడు జయశంకర్ మా నియోజకవర్గమే. గతంలో ఆయన తీసిన ‘పేపర్ బాయ్’ తరహాలోనే  ఇది కూడా గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. తను తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అరిషడ్వర్గాలు అనేవి మన అందరిలోనూ ఉంటాయి. వాటిని జయించడం ఎలా అనే జీవిత పాఠాన్ని ఇందులో చర్చించారు. ఇక మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సాయికుమార్ గారు నటించారంటే కచ్చితంగా అదొక మంచి చిత్రం అవుతుంది. ఆయన డైలాగ్ డెలివరీ సినిమాకు ప్లస్ అవుతుంది’ అంటూ టీమ్‌‌‌‌కు బెస్ట్‌‌‌‌ విషెస్ చెప్పారు. 

ఆధ్యాత్మికత అంటే అదొక మతానికి చెందిన అంశంగా చూస్తున్నారని, పరిణితి చెందిన నాయకులుగా ఉండాలంటే ఇలాంటి సినిమాలు చూడాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్‌‌‌‌ వైస్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌ చిన్నా రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు, చిత్రయూనిట్‌‌‌‌ అందరూ పాల్గొన్నారు.