
- అణచివేతకు గురవుతున్న వారందరికీ రాజ్యాంగంలో భద్రత ఉంది
- దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్
- సేవ్ కానిస్టిట్యూషన్, సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిత్యం ఎన్నో మీటింగ్స్‌లో చెబుతున్నారని, పేద ప్రజలను ఆదుకునేందుకు ఆయన నిత్యం పోరాడుతున్నారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహిస్తున్న బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్, ఆల్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ‘సేవ్ కానిస్టిట్యూషన్, సేవ్ ఇండియా’అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
‘‘అణచివేతకు గురవుతున్న కులాలకు, ఆయా ప్రజలకు రాజ్యాంగంలో భద్రత ఉంది. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుకోవాలి. దళితులు ఉన్నత స్థాయిలో ఉన్న జాతి గురించి చెప్పుకోవడం లేదు. అంబేద్కర్ మనందరిలో ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో సొంత డబ్బులతో విగ్రహాలు ఏర్పాటు చేశాను. -పేద బిడ్డలకు మంచి చదువు అందించాలని మా నాన్న కాకా వెంకటస్వామి బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌ని స్థాపించారు. రాజ్యాంగాన్ని రాయడంతో పాటు దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన చెబుతుండే వారు.
అందుకే అంబేద్కర్ పేరు ఇనిస్టిట్యూషన్స్‌కి పెట్టినట్లు కాకా చెప్పేవారు. ఆయన ఆశయాలను మనం కొనసాగించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఆ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఇప్పుడు 6 వేల మంది చదువుతున్నారు. ఇండియా టుడే దేశవ్యాప్తంగా బెస్ట్ ఇనిస్టిట్యూషన్స్‌పై సర్వే చేస్తే దేశంలోనే 5వ స్థానంలో అంబేద్కర్ లా కాలేజ్ నిలిచింది. ఇందులో 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, పేదవాళ్లే చదువుతున్నారు. విద్యాసంస్థలో డొనేషన్స్ తీసుకోవడం లేదు. ఫస్ట్ ఇయర్‌లో 80 శాతం మార్కులు వస్తే రెండో ఏడాది ఉచిత విద్య అందిస్తున్నాం.
అంబేద్కర్ లా కాలేజ్ నుంచి 8 మంది జడ్జిలు అయ్యారు. ఇటీవల కొంత మంది సివిల్స్ ప్రిల్సిమ్స్‌లో క్వాలిఫై అయి మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో న్యాక్ గ్రేడ్ సాధించిన ఏకైక కాలేజ్ అంబేద్కర్ లా కాలేజ్”అని వివేక్ పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. తాను సీఐఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు పెన్షన్ సిస్టమ్ తీసేయాలని ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు ఒత్తిడి తేవడంతో ఇదే విషయం మా నాన్న కాకా దృష్టికి తీసుకెళితే తన మీద సీరియస్ అయ్యారని గుర్తుచేశారు. సోషల్ జస్టిస్‌పై పోరాడేందుకు అందరూ ముందుకు రావాలని
ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ అంటే రాజ్యాంగం మాత్రమే కాదు..అంతకుమించి..
ఇలాంటి అంశాలపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించడం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరిన్ని మీటింగ్స్ నిర్వహించాలని నిర్వాహకులను మంత్రి వివేక్ కోరారు. బీఆర్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు, రాజ్యాంగం మాత్రమే కాదని, ముందు చూపుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్థాపన, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు ఆయన ఆలోచనేనన్న విషయం ఇప్పటివాళ్లకు తెలియదన్నారు. ఇలాంటివి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కుల వివక్ష ఉన్నందున 30 శాతం వరకు ప్రోత్సాహం ఉండటం లేదన్నారు.
ఉన్నత స్థాయిల్లో ఉండి రిటైర్ అయిన ఎంతో మంది వ్యక్తులు దళితుల అభ్యన్నతికి కృషి చేస్తున్నారని, ఇది అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల అంబేద్కర్ మనువడు హైదరాబాద్ వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్లానని, ఆయన సైతం కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినట్లు తనతో అన్నారన్నారు. మా నాన్న, మా అన్న సైతం కార్మిక మంత్రిగా చేశారని తాను కూడా ఆయనకు చెప్పానన్నారు. కాకా వెంకటస్వామి స్థాయిలో తాను లేనని, ఆయన చూపిన దారిలో ముందుకెళ్తూ కాకా ఆశయాలను నెరవేరుస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రముఖ చిత్రకారుడు కందునూరి వెంకటేశ్వర్లు మంత్రి వివేక్ వెంకటస్వామికి తాను వేసిన అంబేద్కర్ పెయింటింగ్‌ని బహూకరించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం కొమ్ములవంచకు చెందిన భారతమ్మ, రాములు కొడుకే వెంకటేశ్వర్లు. ఆయన చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం, పెయింటింగ్ పై ఆసక్తి పెంచుకుని హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి బీఎఫ్ఏ పట్టా పొందారు.