సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం

సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం
  • సీఎం  స్వయంగా హాస్పిటల్​కు వెళ్లి బాధితులను పరామర్శించారు
  • ఆ కంపెనీ ఎండీపై పలు సెక్షన్ల కింద కేసుపెట్టి జైలుకు పంపించినం
  • సిగాచి అంశంపై  హరీశ్​రావు విమర్శలు అర్థరహితమని ఫైర్

గోదావరిఖని, వెలుగు: గత ఏడాది సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేసిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 54 మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు  రూ.50 లక్షల చొప్పున  కంపెనీ ద్వారా పరిహారం ఇప్పించినట్టు చెప్పారు. సిగాచి కంపెనీ ఎండీపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపించామన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక హరీశ్​ రావు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మంత్రి ఫైర్​ అయ్యారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు సంభవిస్తే సీఎం రేవంత్​రెడ్డి, తనతోపాటు మంత్రులు శ్రీధర్​బాబు, దామోదర రాజనర్సింహ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, సీఎం స్వయంగా హాస్పిటల్​కు వెళ్లి గాయపడ్డ కార్మికులను పరామర్శించారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హరీశ్​ రావు కావాలనే  రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి విమర్శిస్తున్నారన్నారు. సిగాచి కంపెనీ మేనేజ్​మెంట్​పై క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించామని, కంపెనీ ఎండీని సెక్రటేరియెట్​కు  పిలిపించి మాట్లాడామన్నారు. అమెరికా ప్రెసిడెంట్​ట్రంప్​ తీసుకున్న నిర్ణయాల వల్ల తమ ప్రొడక్ట్స్​ టారిఫ్​ పెరిగిందని, తమ ఉత్పత్తులను ఎక్స్​పోర్ట్​ చేయలేకపోతున్నామని అందువల్ల  మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్టు ఎండీ చెప్పారన్నారు. హైకోర్టులో కేసు వేసినప్పుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చామని, ఈ విషయంలో సిగాచి కంపెనీ ఎండీ రెస్పాండ్​కాకపోతే అతనిపై సెక్షన్​ 105, 110, 118/1, 118/2 కింద కేసు నమోదు చేశారని, 2025 డిసెంబర్​ 22 నుంచి 2026 ఫిబ్రవరి 2 వరకు ఆయన జైలులో ఉన్నారని తెలిపారు. కంపెనీ లోపాలపైనా చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు. 

ప్రభుత్వంపై విమర్శలు కరెక్ట్​ కాదు

తాము అన్ని చర్యలు తీసుకున్నా రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం సరైంది కాదని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 66 మంది చనిపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని మంత్రి వివేక్​ ప్రశ్నించారు. ఆ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఇంటర్మీడియట్​ బోర్డు నిర్లక్ష్యం వల్ల పేపర్​ లీక్ అయి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ మీటింగ్​లో లీడర్లు పి.మల్లికార్జున్​, గుమ్మడి కుమారస్వామి, వంగ లక్ష్మిపతిగౌడ్, దుబాసి మల్లేశ్, గోవర్ధన్​ రెడ్డి, బోయిని మల్లేశ్​ యాదవ్, కామ విజయ్, తిప్పారపు మధు, జావెద్, కల్వల సంజీవ్, నరేందర్​ రెడ్డి, గడ్డం మధు, హకీమ్, శ్యామ్​ సుందరాచారి, తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్​వి తప్పుడు ఆరోపణలు

  •     గత పదేండ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్​ లూటీ చేసింది: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  •     కేసీఆర్ ​ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.5 వేల కోట్ల మిత్తి కడుతున్నం
  •     మహిళా సంఘాలకు బస్సులు, పెట్రోల్ బంకులు అందిస్తున్నమని వెల్లడి

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీనీ అమలు చేయలేదంటూ కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేటీఆర్​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. గత పదేండ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్​ లూటీ చేసిందని, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిందని అన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పులకు తమ ప్రభుత్వం నెలకు రూ.5 వేల కోట్ల మిత్తి కడుతున్నదని పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్​ మండలాల్లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్​ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను చూస్తే కాంగ్రెస్​ ఏం చేస్తుందో కేటీఆర్ కు అర్థం అవుతుందన్నారు. సొంత గూడు లేని పేదల కండ్లలో ఇందిరమ్మ స్కీమ్​ కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇకపై పెంకుటిల్లు అనేదే లేకుండా.. అందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా శక్తి కింద మహిళా సంఘాలకు బస్సులు, పెట్రోల్ బంకులు అందిస్తున్నట్టు చెప్పారు. బస్సుల ద్వారా మంచి ఆదాయం వస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.