సింగరేణి నిధులు ఇక్కడే ఖర్చు..దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణి నిధులు ఇక్కడే ఖర్చు..దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • జైపూర్ మూడో పవర్ ప్లాంట్‌‌‌‌తో 5 వేల కొత్త ఉద్యోగాలు
  • సింగరేణిలో కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమే 
  • మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పర్యటన

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థకు సంబంధించిన డిస్ట్రిక్ట్‌‌‌‌ మినరల్స్‌‌‌‌ ఫౌండేషన్ ట్రస్ట్‌‌‌‌ (డీఎంఎఫ్‌‌‌‌టీ) నిధులు ఈ ప్రాంతాల్లోనే ఖర్చు చేసేలా త్వరలో చట్టం తీసుకొస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. డీఎంఎఫ్‌‌‌‌టీ, సీఎస్‌‌‌‌ఆర్ నిధులను పూర్తిగా ఇక్కడే ఖర్చు చేస్తే కోల్‌‌‌‌బెల్ట్ ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని బురదగూడెం, సుభాష్ నగర్ వార్డుల్లో ఆయన పర్యటించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టమవుతుందని, ఈ ప్రాంతంలో ఉపాధి, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహించే బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనాలని సూచించారు. బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కోరినట్లు చెప్పారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అవరణలో 850 మెగావాట్ల మూడో ప్లాంట్‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో భూమి పూజ చేయిస్తానని తెలిపారు.

 ఈ ప్లాంట్‌‌‌‌తో 5 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. సింగరేణి 2024-–25లో సాధించిన లాభాలపై ఆడిట్‌‌‌‌ జరుగుతున్నదని,ఈసారి రికార్డు స్థాయిలో లాభాలొచ్చే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ పూర్తి కాగానే కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటిస్తామని చెప్పారు. 2017–-18 మధ్య సంస్థలో రిటైర్డ్‌‌‌‌ అయిన కార్మికులకు రూ.20 లక్షల గ్రాట్యూటీ ఇప్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, సింగరేణి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గిగ్ వర్కర్లకు మినిమం వేజెస్ అందించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సింగరేణి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో చర్చించినట్లు చెప్పారు. 

రెడ్‌‌‌‌ కేటగిరీ పరిశ్రమల్లో శిక్షణ పొందిన కార్మికులు.. 

పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం నేపథ్యంలో ఇక నుంచి ఫార్మా తదితర రెడ్ కేటగిరీ పరిశ్రమల్లోని కీలక విభాగాల్లో శిక్షణ పొందిన కార్మికులను నియమించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్‌‌‌‌ వెల్లడించారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శికి ఆదేశాలిచ్చామని, త్వరలోనే దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం విడతల వారీగా పరిహారం చెల్లిస్తుందన్నారు. మరోవైపు, మందమర్రి మున్సిపాలిటీలోని 23వ, 5వ వార్డులో మంత్రి వివేక్‌‌‌‌ మార్నింగ్ వాక్‌‌‌‌ చేశారు. 

ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

గాంధారీ మైసమ్మ, కాలబైరవ దేవుడికి పూజలు.. 

మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద గల గాంధారీ మైసమ్మ ఆలయం, గాంధారీఖిల్లాలోని కాలభైరవుడికి మంత్రి వివేక్ వెంకటస్వామి పూజలు చేశారు. ఈ నెల 20న గాంధారీ మైసమ్మ ఆలయంలో నిర్వహించే బోనాల జాతర పోస్టర్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. బోనాల పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని మైసమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. 

మంత్రిగా తొలిసారి వచ్చిన వివేక్‌‌‌‌కు కాలనీ వాసులు, కాంగ్రెస్, సీపీఐ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రి వెంట సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, కాంగ్రెస్ లీడర్ కిషన్ రావు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఏఈ సందీప్, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ గణేశ్ రాథోడ్, పీసీసీ మెంబర్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, లీడర్లు బండి సదానందం యాదవ్, సుదర్శన్, దుర్గం నరేశ్, మందమర్రి, క్యాతనపల్లి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్లు ఉపేందర్ గౌడ్, పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు. 

తలమడుగులో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విగ్రహావిష్కరణ..

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నప్పటికీ దేశం ఏకతాటిపై ఉందంటే.. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే సాధ్యమైందన్నారు. దళితులు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జిలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత కుమ్రం భీం, చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు.