ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రజలు కొట్టుకునేలా చేస్తున్నారు

ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రజలు కొట్టుకునేలా చేస్తున్నారు
  • తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతోంది
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి

హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునేలా మాట్లాడుతున్నారని.. పథకం ప్రకారం తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన చిట్ చాట్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు జరిగిందే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కానీ ఇప్పుడు రాజకీయ లబ్దికోసం జలవివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే.. కృష్ణా జలాల ఇష్యూ క్రియేట్ చేశారని ఆయన విమర్శించారు. 
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఉద్యమాలు ఉండవు అన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవని చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రగతి భవన్ లో జగన్ కేసీఆర్ ఒకరికొక్కరు ముద్దలు తినిపించుకున్నారని తెలిపారు. ఇప్పుడేమో తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునేలా ఇరు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారని.. ఇద్దరు సీఎం లు.. మరో కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాలపై పోరాటం చేస్తామని షర్మిల ఇంకో కొత్త డ్రామా అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ కూడా  మరో డ్రామా ఆడుతుందని.. ఈ వివాదాన్ని బీజేపీ సర్కార్ సెటిల్ చేస్తదా అని ఆయన ప్రశ్నించారు. షర్మిల వైఎస్సార్ కూతురు.. కొడుకు జగన్.. ఇద్దరు డ్రామాలే.. జగన్, కేసీఆర్ కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రులు.. ఈ సమస్యపై ఎందుకు కూర్చొని మాట్లాడుకోవడం లేదని ఆయన నిలదీశారు. 
బీజేపీ, జగన్, కేసీఆర్, షర్మిల.. వీరంతా ఒక కుటుంబం
బీజేపీ, జగన్, కేసీఆర, షర్మిల.. వీరంతా ఒకే కుటుంబం, రాజకీయ లబ్ది కోసమే ఆరాటం మొదలైందని జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రం వచ్చాక నీళ్ల పంచాయితీ మొదలైందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గట్టిగా డిమాండ్ చేస్తుందన్నారు. దివంగత పీజేఆర్, వైఎస్సార్ మధ్య జలవివాదం కంటే.. రాజకీయ వివాదమే ఎక్కువ వుండేదని.. పీజేఆర్, వైఎస్సార్ ఇద్దరు సీఎం పదవులు ఆశించారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.