
- టీఎండీసీఎల్ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా
మిర్యాలగూడ, వెలుగు : ఇసుక అక్రమ రవాణను నివారించడంతోపాటు లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా సాండ్ బజార్లను ప్రారంభిస్తున్నట్లు టీఎండీసీఎల్ వైస్ చైర్మన్ భవేశ్‌మిశ్రా తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ లోని చింతపల్లి క్రాస్ రోడ్ వద్ద మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రీచ్ లో ఇసుక అందుబాటు లేని చోట సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టన్ను ఇసుక రూ. 1,230 కమర్షియల్ రేటు నిర్ధారించగా, ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే ఇస్తున్నట్టు చెప్పారు.
ఆన్ లైన్ బుక్ చేసుకుని ఎవరైనా ఇసుక తరలించుకోవచ్చని పేర్కొన్నారు. సాండ్ బజార్ కు ఇసుక వచ్చే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయన్నారు. వే బ్రిడ్జి ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు లబ్ధిదారులకు తక్కువ రేటుకు ఇసుక లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మైనింగ్ ఏడి శ్యాముల్ జాకబ్, తహసీల్దార్లు సురేశ్, హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.