
- నిర్వహణను సరిగా పట్టించుకోని ఎన్జీవో సంస్థ
- కేసుల పరిష్కారంలో లీగల్ అడ్వైజర్ అక్రమాలు
- సెంటర్ లోని బాలిక మిస్సింగ్ తో బహిర్గతం
- మానిటరింగ్ పట్టించుకోని సంస్థ సీఈవో
- సెంటర్ లో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు
ములుగు, వెలుగు : ములుగు జిల్లా సఖి సెంటర్ కేర్లెస్ కు కేరాఫ్‌గా మారింది. ఆపదలో వచ్చిన మహిళలకు భరోసా కల్పించలేకపోతోంది. సంస్థలో అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. దాంపత్య జీవితంలో తలెత్తిన సమస్యలతో కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు సఖి సెంటర్ ఏర్పాటైంది. కౌన్సిలింగ్, కేసుల పరిష్కారం, నిర్వహణ బాధ్యతలను ఎన్జీవో సంస్థకు అప్పగించారు. అయితే ఎన్జీవో సంస్థ నిర్వాహకులు పట్టించుకోకుండా కొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. అందులో పనిచేస్తున్న లీగల్ అడ్వైజర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించిన బాధిత మహిళల వీడియో బహిర్గతం కావడం విమర్శలకు తావిస్తోంది.
డీఎల్ఎస్ఏ సపోర్టు లేకుండానే కోర్టుల్లో కేసులు..
సఖి సెంటర్ కు వచ్చే బాధిత మహిళల కేసులను క్షుణ్ణంగా పరిశీలించి మొదటగా కౌన్సిలింగ్ చేస్తారు. సమస్యలకు పరిష్కారం లభించకపోతే కోర్టుల్లో బాధిత మహిళలకు సపోర్ట్‌గా కేసులు నమోదు చేసి న్యాయం కోసం వాదిస్తారు. కాగా.. డీఎల్ఎస్ ఏ సపోర్టుతో మాత్రమే కోర్టుల్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. గతంలో లీగల్ అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తి ప్రైవేటుగా కేసులు నమోదు చేయించినట్టు తేలింది. సదరు లీగల్ అడ్వైజర్‌పై డీడబ్ల్యూవో ఆధ్వర్యంలో త్రీ మెన్కమిటీ వేసి విచారణ చేసింది. ఆరోపణలు నిజమవడంతో విధుల నుంచి తొలగించారు. ఎన్జీవో నిర్లక్ష్యం వల్ల బాధితుల పక్షాన లీగల్ సెల్ అథారిటీ ద్వారా కాకుండా పదుల సంఖ్యలో కేసులు ప్రైవేటు లాయర్ల ద్వారా వేయించినట్టు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల విచారణ..
సఖి సెంటర్ లో బాలిక మిస్సింగ్, అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి సీతక్క సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు బాలిక మిస్సింగ్ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. మిస్సింగ్‌కు కారకులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సఖి సెంటర్ నిర్వహణ బాధ్యత నుంచి ఎన్జీవో ను తప్పించింది. ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, తప్పిపోయిన బాలిక తమ బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
బాలిక మిస్సింగ్ తో బహిర్గతం
పోక్సో కేసులో ఓ బాలికను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు డీడబ్ల్యూవో సూచనల మేరకు కౌన్సిలింగ్నిర్వహించి గత నెల 11న సఖి సెంటర్ లో భద్రత కోసం ఉంచారు. అయితే బాలిక ఈనెల 2న మిస్ కావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పోలీసులు సఖి సెంటర్ లోని పై అంతస్తులో కిటికీలు తీసుకుని తప్పించుకున్నట్లు చెబుతున్నారు. 13 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా అక్కడ పని చేస్తుంటారు. సెక్యూరిటీ, మల్టీ పర్సస్ వర్కర్స్, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు.
బాలిక మిస్అయిన రోజు విధుల్లో నలుగురు సిబ్బంది ఉన్నట్లు సెంటర్ఇన్చార్జి లావణ్య తెలిపారు. మానిటరింగ్అధికారి కూడా పట్టించుకోకపోవడంతో డీడబ్ల్యూవో మెమో సైతం జారీ చేసినట్లు తెలిసింది. ఏటా సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేసి సఖి సెంటర్ నిర్వహిస్తుండగా ఎన్జీవో సంస్థ నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సైతం సంక్షేమ శాఖ పరిధిలో బాల సదనం నుంచి ఓ బాలిక మిస్ అయిన ఘటన ఉంది.