
- సౌతాఫ్రికా, కరేబియన్ బ్యూటీస్ సింగిల్ డే.. టూ టీమ్స్
- యాదాద్రి నర్సన్న దర్శనం..పోచంపల్లి ఇక్కత్ చీరల పరిశీలన
- రెండు గంటల్లో కంప్లీట్
యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు మిస్‌వరల్డ్ కాంటెస్ట్‌ను ప్రభుత్వం వేదికగా చేసుకుంది. ఈ పోటీలకు వస్తున్న 108 దేశాలకు చెందినవారిలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా షెడ్యూల్రూపొందించింది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో టూరిస్ట్ ప్లేస్‌లు చూసేందుకు ఈనెల 15న సౌతాఫ్రికా, కరేబియన్‌లోని 35 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ వస్తున్నారు. జిల్లాలోని పట్టుచీరలకు నెలవైన భూదాన్‌పోచంపల్లి, ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కు వస్తున్న బ్యూటీలు రెండు గంటలపాటు సందడి చేయనన్నారు.
యాదగిరిగుట్టలో..
పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు 10 మంది బ్యూటీస్ వస్తున్నారు. కొండపై వీరు రెండు గంటలపాటు గడపనున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్‌కు చేరుకున్న వీరికి బొట్టు పెట్టి సంప్రదాయ రీతిలో స్వాగతం పలుకుతారు. ముందుగా వీరు బ్యాటరీ వెహికల్‌పై కొండపైకి చేరుకుంటారు. అక్కడ అఖండ దీపం వద్దకు వెళ్లి జ్యోతిని వెలిగిస్తారు. ఆ తర్వాత తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం వారికి అర్చకులు వేదాశ్వీరచనం చేస్తారు. ఆ తర్వాత ఆలయ మాడవీధుల్లో పర్యటిస్తూ కట్టడాలను పరిశీలించి.. ఫొటోలు దిగి గెస్ట్‌హౌస్‌కు చేరుకొని టిఫిన్ చేస్తారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లిపోతారు.
భూదాన్‌పోచంపల్లిలో..
పట్టుచీరలకు నెలవైన భూదాన్ పోచంపల్లికి 25 మంది బ్యూటీస్ వస్తున్నారు. చేనేత మ్యూజియం వద్దకు చేరుకున్న వీరికి తెలంగాణ సంప్రదాయ రీతిలో కోలాటంతో స్వాగతం పలుకుతారు. చేనేత స్టాల్స్‌ను సందర్శించి అక్కడి ఇక్కత్ చీరలను పరిశీలిస్తారు. అనంతరం వీరి చేతులను మెహందీతో అలంకరించి ట్రెడీషనల్ మ్యూజిక్ విన్పిస్తారు. ఇక్కత్వస్త్రాలను ధరించిన స్థానిక మహిళలు షో చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు టూర్‌కు యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్హనుమంతరావు పరిశీలించారు. వీరు వెళ్లే ప్రతి ప్లేస్‌కు కలెక్టర్వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. బ్యూటీస్ఇక్కడికి చేరుకోగానే వారిని ఎలా స్వాగతించాలన్న విషయంపై ఇప్పటికే రిహార్సల్ కూడా జరిపించారు.
ఓరుగల్లుకు వెళ్తున్న బ్యూటీస్‌కు భువనగిరిలో రెస్ట్..
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు ఈనెల 14న వస్తున్న బ్యూటీస్ కోసం భువనగిరిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భువనగిరి బైపాస్‌లోని ఓ హోటల్లో గదులు కేటాయించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వీరు ఈ హోటల్లో ప్రెషప్అయిన తర్వాత స్నాక్స్ తీసుకొని వరంగల్‌కు వెళ్తారు. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే హోటల్లో ఫ్రెషప్ అవుతారు. స్నాక్స్ తీసుకున్న అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు.
మూడంచెల భద్రత..
వివిధ దేశాలకు చెందిన వీరి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కోసం వందలాది మంది పోలీసులు డ్యూటీలో కొనసాగుతారు. మూడంచెల భద్రత మధ్య వీరి పర్యటన కొనసాగుతుంది. ఇంటర్నేషనల్బ్యూటీల వెంట ఒక్కొక్కకరికీ ఒక్కో మహిళా కానిస్టేబుల్‌ను నియమిస్తారు. అడిషనల్కలెక్టర్, ఇద్దరు ఆర్డీవోలు సహా 20 డిపార్ట్మెంట్లకు చెందిన హెడ్స్ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. వీరి కోసం వీవర్కమ్యూనిటీకి చెందిన 20 మంది మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మరో 20 మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ అందగత్తెలు టెంపుల్పరిధిలో ఉన్నంత సేపు పూర్తిగా పోలీసులు పర్యవేక్షణ ఉంటుంది. వారిని కలవడానికి ఎవరినీ అనుమతించరు. స్వామివారి దర్శనానికి భక్తులను కూడా అనుమతించరు.