Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు వీవీఐపీల కోసం మాత్రమే కాదు.. సామాన్యులు కూడా రావొచ్చు: జయేష్ రంజన్

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు వీవీఐపీల కోసం మాత్రమే కాదు.. సామాన్యులు కూడా రావొచ్చు: జయేష్ రంజన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘మిస్ వరల్డ్’’ పోటీలు వీవీఐపీల కోసం మాత్రమే కాదని, సామాన్యులు కూడా రావొచ్చని సీఎంవో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు మే 10న ఆఫిషియల్గా ప్రారంభం అవుతాయని, ఆసక్తి ఉన్నవాళ్ళు టూరిజం వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని పాస్ కలెక్ట్ చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ఫుడ్, కల్చర్, హాస్పిటాలిటీని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పబోతున్నామని, మన టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని జయేష్ రంజన్ వివరించారు.

మిస్‌‌ వరల్డ్‌‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల అందాల తారలు హైదరాబాద్‌‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్‌‌ వరల్డ్‌‌ సంస్థ సీఈవో, చైర్‌‌ పర్సన్‌‌ మిస్‌‌ జూలియా ఎవెలిన్‌‌ మోర్లీ, మిస్‌‌ వరల్డ్‌‌ ప్రతినిధి మిస్‌‌ కెర్రి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. మే 7 నుంచి 31వ తేదీ వరకు మిస్​వరల్డ్​ పోటీలు జరగనుండటంతో సోమ, మంగళవారాల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు, ప్రతినిధులు, వివిధ రంగాల  ప్రముఖులు కూడా హైదరాబాద్‌‌కు చేరుకున్నారు.

పోటీలకు ఏర్పాట్లు పూర్తి కాగా.. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌలత్‌లు కల్పిస్తోంది. తొలిసారిగా హైదరాబాద్‌‌లో పోటీలు జరుగుతుండటంతో సీఎం రేవంత్​ రెడ్డి స్పెషల్​ ఫోకస్ పెట్టారు. ఆయన ఇప్పటికే అధికారులతో సమీక్షించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రాంతాలను అందగత్తెలు విజిట్‌‌ చేయనున్నందున ఆ ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మే 31న మిస్‌‌వరల్డ్ గ్రాండ్​ఫినాలే జరగనుంది. ఈ కార్యక్రమానికి 3 వేల మంది సందర్శకులకు మాత్రమే ఎంట్రీ పాస్‌‌లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ప్రజలు ఈ పోటీలను వీక్షించేలా హైదరాబాద్‌‌తో పాటు జిల్లా కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో రాష్ట్ర ప్రభుత్వం స్ర్కీన్లను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ వేడుక ద్వారా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు పర్యాటక ప్రాంతాల సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సదుపాయాల ప్రదర్శన వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’ వంటి నినాదాలతో 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోంది.