హోషియార్‌‌పూర్‌‌లో మిసైల్ శకలాలు.. స్వాధీనం చేసుకున్న ఎయిర్​ఫోర్స్

హోషియార్‌‌పూర్‌‌లో మిసైల్ శకలాలు.. స్వాధీనం చేసుకున్న ఎయిర్​ఫోర్స్

హోషియార్‌‌పూర్/బటిండా: ఇండియా, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ కొనసాగుతున్న సమయంలో పంజాబ్​లోని హోషియార్‌‌పూర్‌‌, బటిండాలో లోహ శకలాలు లభ్యమయ్యాయి. హోషియార్‌‌పూర్‌‌ లోని ఒక పొలంలో మిసైల్ శకలాల లాంటివి, బటిండాలోని రెండు ప్రాంతాల్లో కొన్ని గుర్తుతెలియని వస్తువులకు చెందిన లోహ శకలాలు గుర్తించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. హోషియార్​పూర్ ఎస్పీ ముకేశ్​కుమార్ మాట్లాడుతూ గురువారం రాత్రి ఆకాశంలో పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నామని, లైట్లు మెరుస్తున్నట్లు చూశామని బటిండా వాసులు కొందరు పేర్కొన్నట్టు చెప్పారు. 

ఇది ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను కలిగించిందన్నారు. శకలాలు పడిన ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా గస్తీ పెట్టి ఇండియన్ ఎయిర్​ఫోర్స్(ఐఏఎఫ్)​​కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఐఏఎఫ్​ నుంచి ఒక టీమ్​ ఘటనాస్థలానికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ‘‘గురువారం రాత్రి కొన్ని వస్తువులు మైదానంలో పడ్డాయి. 

ఆ తరువాత పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది. దీని వలన సమీపంలోని ఇంటి కిటికీలు, తలుపులు. పశువుల కొట్టం దెబ్బతిన్నాయి. ఆ వస్తువు పడిన దగ్గర మూడు అడుగుల గొయ్యి ఏర్పడింది” అని బటిండాకు చెందిన రైతు ఒకరు తెలిపారు.