ఆక్రమణల చెరలో ‘దేవాదుల’ భూములు.. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ  పాత పట్టాదారుల పేర్లు

ఆక్రమణల చెరలో ‘దేవాదుల’ భూములు.. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ  పాత పట్టాదారుల పేర్లు
  • ప్రాజెక్టు కోసం గతంలో సేకరించిన 1,538 ఎకరాలను మ్యుటేషన్ చేయని 
  • రెవెన్యూ అధికారులు రికార్డుల్లో ఇప్పటికీ  పాత పట్టాదారుల పేర్లు
  • ఇరిగేషన్ ఆఫీసర్లు  లేఖ రాసినా బదలాయించట్లే
  • చేతులుమారుతున్న  రూ.కోట్లు విలువ చేసే భూములు

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్  భూములు మాయమవుతున్నాయి! దేవాదుల ఏర్పాటు కోసం గతంలో రాష్ట్ర సర్కారు రైతులకు పరిహారం చెల్లించి భూములు సేకరించగా.. వాటిని ప్రాజెక్టు పేరున బదలాయించాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఇరిగేషన్  ఆఫీసర్లు తహసీల్దార్లకు లేఖలు రాసి వదిలేశారు. దీంతో భూ రికార్డుల్లో ఇప్పటికీ పాత పట్టాదారుల పేర్లే కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఆ భూముల రేట్లు రూ.కోట్లకు చేరడంతో కొంత మంది రియల్టర్లు రంగంలోకి దిగి ఆఫీసర్లను మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్  మండలంలో ఈ బాగోతం వెలుగులోకి రాగా.. దేవాదుల భూములతో దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మ్యుటేషన్  చేయనివే 1,538 ఎకరాలు..

గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని లిఫ్ట్  చేసి 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద 2004లో జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రాజెక్టు ఏర్పాటు, ఫీడర్  మెయిన్స్, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కోసం 33,324 ఎకరాలు అవసరం కాగా.. ఇరిగేషన్  అధికారులు విడతల వారీగా 30,267 ఎకరాలను సేకరించారు. ఇంకో 2,957 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉంది. భూసేకరణ సమయంలో అధికారులు కాస్తులో ఉన్న రైతులకు అవార్డు చేసిన ప్రకారం పరిహారం కూడా చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉన్నా సేకరించిన భూమిని తహసీల్దార్లు ప్రాజెక్టు పేరు మీద మ్యుటేషన్  చేయలేదు. ఇలా మ్యుటేషన్  చేయని భూములే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 1,538 ఎకరాల వరకు ఉండగా.. ధర్మసాగర్  మండలంలో వంద ఎకరాలకు పైగా ఉన్నాయి.

పాత పట్టాదారుల పేరుతో రిజిస్ట్రేషన్లు..

భూసేకరణ సమయంలో ఆఫీసర్లు ఫిజికల్ గా పొజిషన్ లో ఉన్న రైతులను పరిగణనలోకి తీసుకొని పరిహారం చెల్లించారు. కానీ, రికార్డుల్లో ఇతరుల పేర్లు ఉండటం, కాస్తులో వేరే రైతులు ఉండడంతో సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో చాలాచోట్ల పాత పట్టాదారుల పేర్లే రికార్డుల్లో కనిపిస్తున్నాయి. దీంతో కొంత మంది రెవెన్యూ రికార్డులు, ఫీల్డ్ లో ఉన్న లొసుగుల ఆధారంగా దందాకు తెరలేపారు. ఓ వైపు భూములు దేవాదుల ఇరిగేషన్  ప్రాజెక్టు పేరు మీద మ్యుటేషన్  కాకపోవడం, మరోవైపు రికార్డుల్లో ఇతర రైతుల పేర్లు వస్తుండడంతో వారి ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ధర్మసాగర్  మండల కేంద్రంలోని 1057 సర్వే నంబర్​లో మూడెకరాల భూమిని ఇరిగేషన్  ఆఫీసర్లు ఇంజనీర్ల క్వార్టర్లు నిర్మించారు. కానీ, ఆ ల్యాండ్  ఇరిగేషన్  డిపార్ట్​మెంట్ కు మ్యుటేషన్  చేయకపోవడంతో ఇటీవల కొందరు వ్యక్తులు అమ్మేందుకు యత్నించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆ ల్యాండ్  రిజిస్ట్రేషన్  ఆగిపోయింది. 

చేతులు మారుతున్న భూములు..

దేవాదుల భూములను ప్రాజెక్టు పేరున బదలాయించకపోవడం, భూముల రేట్లు బాగా పెరిగిపోవడంతో కొంత మంది ఆఫీసర్లను మేనేజ్  చేసుకొని భూ దందా చేస్తున్నారు. దీంతో దేవాదుల భూములు చాలా చోట్ల చేతులు మారిపోయాయి. ఇలా దేవాదుల భూములతో అక్రమ దందా చేస్తున్న వ్యక్తులకు కొందరు ఆఫీసర్లు సపోర్ట్  చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు దేవాదుల ప్రాజెక్టు భూములను మ్యుటేషన్  చేయించడంతో పాటు వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ధర్మసాగర్  తహసీల్దార్​ సదానందంను వివరణ కోరగా.. పరిహారం చెల్లించే సమయంలో భూరికార్డుల్లో ఒకరు, కాస్తులో మరొకరు ఉండడంతో సమస్య ఏర్పడిందని చెప్పారు. వాటన్నింటినీ వెరిఫై చేసి మ్యుటేషన్ చేస్తున్నామని తెలిపారు.

మ్యుటేషన్ కోసం  గతంలోనే లేఖ రాశాం..

దేవాదుల ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను మ్యుటేషన్  చేయాలని గతంలోనే తహసీల్దార్​కు లేఖ రాశాం. ఆ ప్రక్రియ పెండింగ్ లో ఉంది. కొన్ని చోట్ల వివాదాలు ఏర్పడుతున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దేవాదుల భూములను మ్యుటేషన్  చేయించేందుకు చర్యలు తీసుకుంటాం.
– హరి రాంప్రసాద్, ఎస్ఈ, దేవాదుల-

దేవాదుల లిఫ్ట్  ఇరిగేషన్  ప్రాజెక్టు కింద ఫేస్ 1,2,3లో పైపులైన్ల ఏర్పాటు కోసం ధర్మసాగర్  రైతులకు చెందిన భూమిని సేకరించారు. ఇందులో 790 సర్వే నంబర్ లో దేవదాసు అనే రైతుకు పరిహారం చెల్లించి ఎకరం భూమి తీసుకున్నారు. కానీ, ఆ భూమిని దేవాదుల ప్రాజెక్టు పేరు మీదకు మార్చాల్సిన రెవెన్యూ అధికారులు విషయాన్ని గాలికొదిలేశారు.

ఆ తరువాత అండర్  గ్రౌండ్  నుంచి దేవాదుల పైపులు వేశారు. దీంతో ఇరిగేషన్  ఆఫీసర్లు కూడా లైట్  తీసుకున్నారు. దీంతో ఆ భూమిని ఇప్పుడు దేవదాసు కొడుకులు పట్టా చేయించుకున్నారు. అది దేవాదుల భూమి అని తెలిసీ పట్టా ఎలా చేశారనే ప్రశ్న ఎదురవుతోంది.

దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మసాగర్  చెరువును రిజర్వాయర్ గా డెవలప్  చేసేందుకు సర్వే నంబర్​ 1146లోని అప్పాల సాయిలుకు చెందిన 36 గుంటల భూమిని సేకరించారు. దానికి పరిహారం కూడా చెల్లించారు.

కానీ, ఆ భూమిని ఇరిగేషన్  ప్రాజెక్ట్  పేరున మ్యుటేషన్  చేయలేదు. దీంతో ఓ రియల్  ఎస్టేట్  వ్యాపారి రంగంలోకి దిగాడు. 2024 అక్టోబర్ లో పాత పట్టాదారుల వారసుల పేరు మీద కొంత భూమిని రిజిస్ట్రేషన్  చేయించి, వారి నుంచి 2025 ఆగస్టులో సాయిలుకు రిజిస్ట్రేషన్  చేశాడు. ఆ తరువాత రెండు నెలలకు తన పేరు మీదకు మార్చుకున్నాడు.