
భార్యా పిల్లలను విడిచి వెళ్లిపోయిన భర్తను పట్టించింది ఓ టిక్ టాక్ వీడియో. తమిళనాడులోని విల్లుపురంలో సురేష్, జయప్రద అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2013 లో సురేష్, జయప్రదలకు పెళ్లిజరిగింది. సురేష్ విల్లుపురంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అయితే 2016వ సంవత్సరం డ్యూటీకి వెళ్లొస్తానని వెళ్లిన సురేష్ ఇక తిరిగి రాలేదు. సురేష్ కోసం అతని బంధువులు అన్నిచోట్లా తిరిగి.. చివరికి పోలీస్ కంప్లేంట్ కూడా ఇచ్చారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న విల్లుపురం పోలీసులు చాలా కాలం సురేష్ కోసం గాలించినా లాభం లేకపోయింది.
ఈ మధ్య ఓ టిక్ టాక్ వీడియో సురేష్ ను పట్టించింది. ఆ వీడియోలో ఓ ట్రాన్స్ జెండర్ తో సురేష్ ఉన్న వీడియోను జయప్రద చుట్టాలు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వీడియో ఆదారంగా.. సురేష్ క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడే ఓ ట్రాన్స్ జెండర్ ను పెండ్లి చేసుకున్నట్లు పోలీసు విచారణలో తెలిసింది. దీంతో అక్కడి ట్రాన్స్ జెండర్ అసోషియోషన్ తో పోలీసులు మాట్లాడి సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సురేష్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు.