
- నిధులు రాక ఇబ్బంది పడుతున్న అనాథలు
- వేలలో అప్లికేషన్లు, వందల్లో మంజూరు
- సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 8 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్
నల్గొండ, వెలుగు : అనాథ పిల్లలకు చేదోడువాదోడుగా ఉండే 'మిషన్ వాత్సల్య' పథకం అటకెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు గత ఆరు నెలలుగా సాయం అందడం లేదు. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు.
ఫండ్స్ రాక ఇబ్బంది పడుతున్న అనాథలు..
తల్లిదండ్రులు చనిపోయినవాళ్లు, హెచ్ఐవీ బాధిత తల్లిదండ్రుల పిల్లలు, తండ్రి చనిపోయి తల్లి వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన పిల్లలు, వితంతువుల పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారు, బాల్య వివాహ బాధ్యులు అంటే 18 సంవత్సరాలలోపు బాలలు మిషన్ వాత్సల్యం పథకానికి అర్హులు. వీరికి నెలకు ప్రభుత్వం రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది. మహాత్మాజ్యోబాపూలే, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటుంటే పిల్లలకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారికి మాత్రం సాయం అందనుంది.
ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలి. తల్లిదండ్రులు లేని అనాథలు, తల్లి ఉండి తండ్రి లేని పిల్లలకు, కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కూడా నెలకు రూ.4 వేల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం 7 నెలలుగా ఈ ఫండ్స్ విడుదల చేయకపోవడంతో అనాథ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024 డిసెంబర్ లో ఫండ్స్ విడుదల చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం మిగిలిన ఫండ్స్ విడుదల చేయడం లేదు.
మంజూరు కానీ కొత్త అప్లికేషన్లు..
స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని బాలల సంరక్షణ సమితి ఈ ఏడాది పథకం కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 9,500 అప్లికేషన్లు స్వీకరించింది. ఇందులో నల్గొండ జిల్లాలో 7 వేలు, సూర్యాపేట జిల్లాలో 2,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో తల్లిదండ్రులు లేని వారిని వడపోసి నివేదికను తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు అందజేశారు.
వీరిలో కేవలం తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేసింది. నల్గొండ జిల్లాలో 319 మంది, సూర్యాపేట జిల్లాలో 220 మంది అనాథ పిల్లలను మాత్రమే ఎంపిక చేసింది. మిగతా వారికి ఫండ్స్ కేటాయించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కొనసాగుతుందా.. లేదా..? అనే అయోమయం లబ్ధిదారుల్లో నెలకొంది.
ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పంపించాం
అనాథ పిల్లలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ వస్తుంది. 2024 డిసెంబర్ వరకు ఫండ్స్ విడుదల అయ్యాయి. మిగిలిన వాటి కోసం ప్రపోజల్స్ పంపించాం. ప్రాధాన్యత ప్రకారం అనాథలకు మాత్రమే మంజూరవుతున్నాయి.
రవి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సూర్యాపేట జిల్లా