ఈ మ్యాంగో చాలా కాస్ట్​లీ గురూ

ఈ మ్యాంగో చాలా కాస్ట్​లీ గురూ

మామిడి పండ్లు.. ఆ పేరు వినగానే దాని రుచితోపాటు ధర కూడా గుర్తొస్తది. మార్కెట్లో సాధారణంగా మామిడి ధర ఎంత ఉంటుంది.రకాన్ని బట్టి కిలో రూ.30 – రూ.400 వరకు మారుతుంటుంది. అదే పండు ధర కిలో రూ.2.75 లక్షలు ఉంటే.. ఒక్క నిమిషం ఆగండి.. కంగారు పడకండి మీరు విన్నది నిజమే. అంత కాస్ట్​లీ పండ్లు కూడా ఉన్నాయా? అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఉన్నాయ్. అవీ మన దేశంలోనూ అందుబాటులో ఉన్నాయ్​.. ఎక్కడంటారా.. వెస్ట్​బెంగాల్ లో. ఆ రాష్ర్టంలోని సిలిగుడి జిల్లా మటిగర మాల్​లో అమ్ముతున్న పండ్లు మీ క్వశ్చన్స్​అన్నింటికీ ఆన్సర్స్​ ఇస్తాయ్​. ఈ మాల్​లో 262 రకాల మామిడి పండ్లు ప్రదర్శనకు ఉంచగా  మియాజాకిని చూసేందుకే జనం ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధరే వీటిని ఆకాశానికెత్తింది.  ఈ మామిడి రకాన్ని మియాజకీ అంటారు. 

పర్పుల్​ టు రెడ్.. 

ఈ రకం మామిడిని ఇండియాలాగే ఆసియా దేశాల్లో సాగు చేస్తారు. జపాన్‌లోని మియాజకీ నగరంలో ఈ రకం పండ్లు మొదట కనిపించాయి కాబట్టి ఈ మామిడి పండ్లకు మియాజకీ అనే పేరు వచ్చింది. ఇవి చూడటానికి పర్పుల్‌ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు లేత ఎరుపు రంగులో కనిపిస్తాయి. జపాన్‌లో ఈ పండును ‘తైయో నొ తమాగో’ అని అంటారు. జపనీస్‌ భాషలో తైయో నొ తమాగో అంటే తెలుగులో ‘సూర్యుడి గుడ్డు’ అని అర్థం. ఈ మామిడి పండ్లు పరిమాణంలో సాధారణ మామిడి పండ్ల కంటే పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. వీటిలో తీపి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ పండ్లు కోతకు వస్తాయని రైతులు చెబుతున్నారు.