కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ఫ్యామిలీకే కామధేను : ఆది శ్రీనివాస్

కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ఫ్యామిలీకే కామధేను :   ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే కామధేనువని, రాష్ట్ర రైతాంగానికి కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిగడ్డ  టూర్ కు వెళ్లిన బీఆర్​ఎస్​నేతలు.. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తారని ఆశించామని, అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్​అయ్యారు. టూర్ కు వెళ్లి ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. వారి పర్యటన ప్రకృతికి కూడా ఇష్టం లేదని, అందుకే బస్ టైర్ పేలిందన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ గత అక్టోబర్ లో డ్యామేజ్ అయితే కేసీఆర్ ఇంత వరకు  ఎందుకు స్పందించలేదన్నారు. 

అసెంబ్లీలో ఇరిగేషన్, కృష్ణ జలాలపై జరిగిన చర్చకు కూడా రాలేదని, మేడిగడ్డ టూర్ కు సైతం వెళ్లలేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్​ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు టూర్​కు వెళ్తుంటే.. ‘‘బొందల గడ్డకు వెళ్తున్నరా.. ఏ మొఖం పెట్టుకొని వెళ్తున్నరు..’’ అని కేసీఆర్ చేసిన కామెంట్లకు ఇపుడు కేటీఆర్ ఏం సమాధానం చెప్తాడని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో ప్రతి పైసా కక్కిస్తామని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని, ఇంకా తామే అధికారంలో ఉన్నామన్నట్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు. తమ పార్టీ, సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఆయన ఆది శ్రీనివాస్  హెచ్చరించారు.  

జోకర్లంతా కలిసి విహార యాత్రకు వెళ్లిన్రు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

60 మంది జోకర్లు కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని, రాష్ట్ర ప్రజలకు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కమీషన్లు తండ్రి, కొడుకు, అల్లుడు పంచుకుంటే పాపం మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మిగిలిందని ప్రజలు అంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన అని కేసీఆర్ అనుకుంటే.. మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలవాలని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ ఉచిత సలహాలు  వింటుంటే ఆయన చదువుకున్నడా? లేదా? అనే డౌట్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల మీద కేసీఆర్ కుటుంబం మాటలు వింటుంటే మనిషిని చంపిన డాక్టరే అంత్యక్రియలు ఎట్లా చేయాలో చెబుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.