సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ : ఎమ్మెల్యే మందుల సామేల్

సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ : ఎమ్మెల్యే మందుల సామేల్

నకిరేకల్ (శాలిగౌరారం ), వెలుగు : కాంగ్రెస్​ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం శాలిగౌరారంలో రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన  ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయ భవనం, గోదాంను డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. 

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమం లో బ్యాంకు జిల్లా డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, గుడిపాటి సైదులు, అసిస్టెంట్ రిజిస్టార్ నాగేశ్వరరావు, ఆడిటర్ జమీల్, నకిరేకల్ బ్రాంచ్ మేనేజర్ కరుణాకర్ రెడ్డి, శాలిగౌరారం సింగల్ విండో చైర్మన్ తాల్లూరి మురళి, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహ, సీఈవో నిమ్మల ఆంజనేయులు పాల్గొన్నారు.

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం

అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని ఎమ్మెల్యే మందుల సామేల్ చెప్పారు. శుక్రవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాలిగౌరారం మండలంలో ఇప్పటివరకు కొత్తగా 2,017 రేషన్ కార్డులు పంపిణీ చేశామని, 9,806 మంది సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.