
- ఆర్ఆర్ యాక్ట్ కింద రూ.3.84 కోట్ల రికవరీకి చర్యలు
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: ఉదండాపూర్ ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలను బయటపెట్టి, బాధ్యులపై చర్యలు తీసుకొనేలా చూస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కొంత మందికి నోటీసులు వచ్చాయని, భూములు లేకపోయినా గైరాన్, భూదాన్ భూములు చూపించి పరిహారం కాజేసిన వారందరినీ బయటకు లాగుతామని హెచ్చరించారు.
భూసేకరణలో జరిగిన అక్రమాలపై తాను అసెంబ్లీ సమావేశాల్లో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఆధారాలు చూపాలన్నారని తెలిపారు. పోలేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 554లో భూములు లేకపోయినా ఎకరానికి రూ.12 లక్షల చొప్పున 23 మంది రూ.3.84 కోట్లు పరిహారం కాజేశారని తెలిపారు. ప్రస్తుతం 23 మందితో పాటు అప్పటి జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ సుదర్శన్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తున్నారని, వారి నుంచి ఆర్ఆర్ యాక్ట్ కింద డబ్బులు రికవరీ చేయడానికి చర్యలు చేపట్టారని చెప్పారు.
ఉదండాపూర్ లో జరిగిన అనేక అక్రమాలలో ఇది ఒకటేనని, ఇంకా బయటకు రావాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ అక్రమాలన్నీ అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల అండదండలతో రెవెన్యూ అధికారులు చేశారని చెప్పారు. అధికారులు, బీఆర్ఎస్ నేతల అక్రమాలతో నష్టపోయిన బాధితులు తమ వద్ద ఉన్న సమాచారం, ఆధారాలను తనకు అందించాలని కోరారు. తనకు నేరుగా అందజేయాలని, లేదంటే తన పీఆర్వో వాట్సాప్ నంబర్(9392017899)కు సమాచారం అందించాలని సూచించారు.