ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి : ఎమ్మెల్యే బాలూనాయక్

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి : ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, వెలుగు : ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం దేవరకొండలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాచీన చరిత్ర, సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలీ ఆదివాసీలదని చెప్పారు. ప్రకృతి బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఆదివాసీలు ఇంకా సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

భూమి కోసం, భుక్తి కోసం, వివక్ష లేని సమాజం కోసం ఉద్యమిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్యసమితి 1994లో ప్రకటించిదని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని  హామీ ఇచ్చారు.

 అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మైనంపల్లి మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి, మహిళా ఉపాధ్యాయులు, గిరిజన మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహ, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, డీటీడీవో చత్రునాయక్, బిక్కు నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఆదివాసీలు జాతి మూలాలను మరువద్దు..

సూర్యాపేట, వెలుగు : ఆదివాసీలు జాతి మూలాలను మరువకుండా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్ సూచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంత్ సేవాలాల్ సూచించిన నియమాలను ఆచరిస్తూ ముందుకు సాగాలన్నారు.