ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే బాలూనాయక్

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఎమ్మెల్యే బాలూనాయక్ రైతులకు సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమునామాధవరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఆయిల్ పామ్ పంట సాగు చేసుకోవాలన్నారు. 

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పారు. అంతకుముందు దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈనెల 20న సీఎం రేవంత్​రెడ్డి దేవరకొండ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ అరుణాసురేశ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

ఆలేరు మండలం కొలనుపాకలో..

యాదాద్రి, వెలుగు : ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్  జంగా రాఘవరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాకలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుకు జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. పంట మార్పిడి వల్ల రైతులకు అధిక ఆదాయం ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ కారణంగా ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. 

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు పంట దిగుబడితో అధిక లాభాలను చేకూర్చే ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంత రావు, మదర్ డైయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ బాబు, ఓఎస్డీ కిరణ్, ఆయిల్ ఫెడ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలేశ్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సుభాషిణి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.