
మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇస్తామని చెప్పిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. శుక్రవారం మిర్యాలగూడ ప్రాంతంలో పనిచేస్తున్న 88 మంది విలేకరులకు ఇంటి స్థలాల పట్టాలను ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము చెప్పినట్టుగానే అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలను అందజేసినట్లు తెలిపారు. ప్రధానంగా సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కృషితో జర్నలిస్టులకు ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ సక్సెస్ అయ్యిందన్నారు. పార్టీలకతీతంగా మిర్యాలగూడ అభివృద్ధికి కృషి చేద్దామని. ఇందులో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.