అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మన్ననూరు ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2.70 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. గురువారం స్కూల్ ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను అన్నిహంగులతో నిర్మించి అన్నివర్గాల విద్యార్థులకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన్ననూరు స్కూల్‌కు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.
నియోజకవర్గంలోని విద్యాలయాలను అన్నిహంగులతో డెవలప్ చేసి ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అమ్రాబాద్, లింగాల, వంకేశ్వరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మన్ననూరు టీ హబ్ ను వినియోగంలోకి తెస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీనివాసులు, వెంకటరమణ, సత్యనారాయణ, గోపాల్, కృష్ణయ్య, బాలయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వంగూర్: మండలంలోని నిజాంబాద్, తిప్పరెడ్డి పల్లి, వంగూరులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. 55 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలస్వామి పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరం ప్రారంభం
లింగాల: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో అనూష ప్రాజెక్ట్ ఎండీ కొండపల్లి జలంధర్ రెడ్డి, శంకర నేత్రాలయం చెన్నై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి చికిత్స కేంద్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారితో మాట్లాడారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శంకర నేత్రాలయం కో ఆర్డినేటర్ రేణయ్య, పార్టీ నేతలు వెంకటయ్య, మల్లయ్య, ముక్తార్, తిరుపతయ్య పాల్గొన్నారు.
