రోడ్డు లేని ఊరంటూ ఉండొద్దు : చిట్టెం పర్ణికారెడ్డి

రోడ్డు లేని ఊరంటూ ఉండొద్దు : చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట, వెలుగు: నియోజకవర్గంలో రోడ్డు లేని ఊరు ఉండవద్దని ఎమ్మెల్యే డాక్టర్  చిట్టెం పర్ణికారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సీవీఆర్  భవన్ లో  శుక్రవారం పంచాయతీరాజ్  శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్డు సౌలతు లేని గ్రామాలు, గిరిజన తండాల లిస్ట్​ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న పనుల వివరాలను సిద్ధం చేయాలన్నారు. 

టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని  సూచించారు. కోయిలకొండ మండలంలోని రోడ్ల పనుల గురించి ఆరా తీశారు. ప్రారంభం కాని పనులన్నీ రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలన్నారు. సీఎం తనకు కొడంగల్, నారాయణపేట రెండు కళ్లు అని చెప్పారని, అది గుర్తు పెట్టుకుని అధికారులు పని చేయాలన్నారు. నిధులు తెచ్చే బాధ్యత తనదని, పనులు చేయించే పని మీదన్నారు. 

జిల్లా కేంద్రంలో రూ.కోటితో నిర్మించాల్సిన సేవాలాల్  భవన్  పనులు పొందిన కాంట్రాక్టర్  అగ్రిమెంట్  గడువు ముగిసిందని ఏఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. పీఆర్​ ఈఈ హీర్యా, డిప్యూటీ ఈఈలు నరేందర్, బాబురావు, కోయిలకొండ డీఈ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.