
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
వంగూరు, వెలుగు : మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టడం ఆ గ్రామస్తుల అదృష్టమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం కొండారెడ్డిపల్లి గ్రామంలోనీ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మంజూరైన 324 ఇందిరమ్మ ఇండ్లు, 99 మందికి నూతన వృద్ధాప్య పెన్షన్, రేషన్ కార్డులను రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగానే కొండారెడ్డిపల్లి గ్రామ డెవలప్మెంట్ కోసం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఫోర్ లైన్ రహదారి, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాలశీతలకరణ కేంద్రం, వెటర్నరీ హాస్పిటల్, యూనియన్ బ్యాంక్, పోస్టాఫీస్, బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సోలార్ విద్యుత్, నూతన ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనంతోపాటు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు అయినట్లు వివరించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు క్యామ మల్లయ్య, వేమారెడ్డి, పులిజాల కృష్ణారెడ్డి, పర్వతాలు, వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.