డబుల్ బెడ్ రూం కోసం జాగలు కొని కట్టిస్తం 

డబుల్ బెడ్ రూం కోసం జాగలు కొని కట్టిస్తం 
  • బీజేపీ ప్రభుత్వంలో పెళ్లి పందిరిలోనే డబ్బులిస్తాం
  • డబుల్ బెడ్ రూం కోసం జాగలు కొని కట్టిస్తం 
  • బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 

ఆదిలాబాద్, వెలుగు : బంగారు తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం డబ్బులు పెళ్లై పిల్లలైనా ఇస్తలేరని..బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి పందిరిలోనే అందజేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గురువారం జైనథ్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే నెలనెల ఫించన్లు ఇస్తామన్నారు. జాగ ఉన్న వారికి డబుల్​బెడ్​రూం కట్టి ఇస్తామని, లేకపోయినా స్థలం కొని నిర్మించి ఇస్తామన్నారు. ఉద్యమ సమయంలో అసెంబ్లీలో స్పీకర్ పోడియం దగ్గరే పడుకున్నామని.. కానీ ఈ ఈ ప్రభుత్వం అసెంబ్లీలో లేచి నిలబడితే సస్పెండ్ చేసి పోలీసు వాహనాల్లో తీసుకెళ్తోందన్నారు.

కేసీఆర్ వల్లే ఒక మహిళా తహసీల్దార్​మీద పెట్రోల్​పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. బెంజ్ కారులో వచ్చే వారికి రైతుబంధు ఇచ్చే అధికారం సీఎంకు ఎక్కడిదని ప్రశ్నించారు. వీఆర్ఏలు 60 రోజులుగా సమ్మె చేస్తున్నా 50 మంది చనిపోయినా సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. విద్యావలంటీర్లు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ సమస్యలపై ఈటలకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, పార్లమెంట్ ఇన్​చార్జి అయ్యనగారి భూమయ్య, నాయకులు సుహాసిని రెడ్డి, కంది శ్రీనివాస్, జ్యోతి రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, ఆదినాథ్, లాలా మున్నా, జోగు రవి పాల్గొన్నారు.