సాగునీటి సమస్యపై ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే ఫైర్​

సాగునీటి సమస్యపై ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే ఫైర్​
  • నిజాయితీగూడెం రైతన్నలను పీఎస్​కు తరలించిన పోలీసులు
  • సొంత పూచీకత్తుపై విడుదల 

మానకొండూర్, తిమ్మాపూర్ వెలుగు : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం నిజాయితీగూడెంలో గ్రామపంచాయతీ భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. సమస్యలపై చుట్టుముట్టి నిలదీయగా రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపటికి పోలీసులు వచ్చి ప్రశ్నించిన వారిని పీఎస్​కు తీసుకువెళ్లారు. కొన్ని గంటల తర్వాత వదిలేశారు. గ్రామ రైతుల కథనం ప్రకారం..తోటపల్లి రిజర్వాయర్ నుంచి తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి మీదుగా పెద్దూరుపల్లి, నిజాయితీ గూడెం, చెంజర్ల గ్రామాలకు సాగునీరందించేందుకు 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ఎల్ కెనాల్ నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే వరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చినా పనులు కంప్లీట్​ చేయలేదు.

దీంతో రైతులు ఎన్నోసార్లు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు విన్నవించుకున్నారు. అయినా పరిష్కారం కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఎమ్మెల్యే గ్రామానికి రాగా రైతులు, స్థానికులు నిలదీశారు. ఈ సందర్భంగా ఒక రైతు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక జడ్పీటీసీ శేఖర్ గౌడ్ రైతులతో ‘ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి కానీ, ఎమ్మెల్యేతో అట్లా ఎందుకు మాట్లాడిన్రు’ అని ప్రశ్నించాడు. దీంతో వారు‘ మీకు కూడా చెప్పాం. అయినా మీరేం చేశారు’ అని బదులిచ్చారు. విషయం పోలీసులకు తెలియడంతో నలుగురైదుగురు రైతులను మధ్యాహ్నం మానకొండూర్​ పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లారు.  సాయంత్రం వరకు అక్కడే ఉంచుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.