ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు

తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ కార్యదర్శిపై పరుష పదజాలం వాడారు. ఓ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికారిపై అలాంటి భాష వాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలి గౌరారం మండలం వల్లాల గ్రామంలో శనివారం ఫించన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాజరయ్యారు. అనంతరం సభలో ఆయన మాట్లాడారు. 2014లో అవకాశం ఇవ్వండి..పెన్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేశారు.

ప్రజలు ఆదరించారని, 57 సంవత్సరాలు నిండిన పేదలందరికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తామని మరోసారి చెప్పి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి ఎవరని ప్రశ్నించారు. అక్కడనే ఉన్న కార్యదర్శి లేచి నిలబడ్డారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కాకుండా మరెవరికి ఫించన్లు ఇచ్చినా..... బాగోదు అంటూ పరుషపదజాలం వాడారు. సభకు హాజరైన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ అధికారిపై అలాంటి భాష వాడుతారా అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.