డాక్టర్ల గైర్హాజర్​పై ఎమ్మెల్యే కడియం ఫైర్

డాక్టర్ల గైర్హాజర్​పై ఎమ్మెల్యే కడియం ఫైర్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని సీహెచ్​సీ ని సోమవారం ఉదయం 10.35కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి, డాక్టర్ల అటెండెన్స్​ రిజిస్టర్​ను పరిశీలించారు. మొత్తం 8 మంది డాక్టర్లకు ముగ్గురు డాక్టర్లు డ్యూటీలో ఎండగా, మిగిలిన ఐదుగురు డాక్టర్లు సూపరిటెండెంట్ సంధ్యరాణి, డాక్టర్లు ప్రదీప్, సుమన్, సౌఖ్య, రజిని గైర్హాజర్​ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్​సీలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్​వో సుధీర్, వైద్య సిబ్బంది డ్యూటీలో లేకపోవడంపై మండిపడ్డారు. 

డాక్టర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్​తో ఎమ్మెల్యే మాట్లాడారు. సకాలంలో డ్యూటీకి రానివారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన కలెక్టర్​ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహసిని, డీఎంహెచ్​వో హరీశ్​రాజ్​ను పంపించారు. వారు ఆసుపత్రిని విజిట్ చేసి, అటెండెన్స్ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆస్పత్రిలోని పేషెంట్లతో మాట్లాడారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేషన్​ఘన్​పూర్​కు 100 బెడ్ల ఆస్పత్రి మంజూరు చేస్తూ గతంలో జీవో రిలీజ్​ అయ్యిందని, ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన నిధులు, డాక్టర్ల పోస్టులు మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్​రెడ్డి, ఎంపీటీసీ గన్ను నర్సింహులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, నీరటి ప్రభాకర్​ ఉన్నారు.