అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తిచేయాలి : కడియం శ్రీహరి

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తిచేయాలి : కడియం శ్రీహరి

జనగామ, వెలుగు: సర్కారు పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆయన జనగామ కలెక్టరేట్ లో స్టేషన్​ఘన్​పూర్​నియోజకవర్గ పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్లకు మెరుగైన విద్యనందించడమే రాష్ర్ట సర్కారు లక్ష్యమన్నారు. 

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమయపాలన పాటించాలని, హాజరు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను మరింతగా పెంచాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ వారంలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో రాము, అధికారులు పాల్గొన్నారు.