నా చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల

నా చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల

ముఖ్యమంత్రులకు చెవిలో చెప్పి..ఐటీ హాబ్ తెస్తామని చెప్పిన గత పాలకుల మాటలు నీటి మూటలే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండకు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.75 కోట్లతో ఐటీ హబ్ ను మంజూరు చేశారని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐటీ హబ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమెరికాలో 16 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని..1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరో ఆరు నెలల్లో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హాబ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పంకజ్ యాదవ్ పాల్గొన్నారు. 

గతంలో అభివృద్ధి లేక నిర్లక్ష్యంగా మారిన నల్గొండపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి..రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. గత పాలకుల చేతుల్లో నలిగిపోయిన నల్గొండలో నేడు నలువైపులా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జూన్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ నల్గొండకు రాబోతున్నారని వివరించారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరమైన విషయాల్లో బద్నాం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. తన చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడుతానని స్పష్టం చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ తనిఖీలకు కూడా తాను సిద్ధమన్నారు. పదవులు, ఆస్తుల కోసం ప్రజలను ఆకట్టుకునేలా చేసిన డ్రామాలు ప్రజలందరూ చూస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గత పాలకుల హయాంలో.. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.