కేసీఆర్ అనుకుంటే ఉప ఎన్నిక రాదు

కేసీఆర్ అనుకుంటే ఉప ఎన్నిక రాదు
  • ఇన్నాళ్లూ అడిగినా ఇవ్వని గట్టుప్పల్ మండలాన్ని ఇప్పుడు ఇవ్వడమే నిదర్శనం : రాజగోపాల్​రెడ్డి

హైదరాబాద్/చౌటుప్పల్​/మునుగోడు, వెలుగు: కేసీఆర్ అనుకుంటే ఉప ఎన్నిక రాదని, ప్రజలు అనుకుంటే వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. రానున్న 15 రోజుల్లో నియోజకవర్గంలో మూడు టీమ్ లతో సర్వే చేయించి, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.  బై పోల్ వస్తే కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడుకు నిధులు ఇస్తుందని, నియోజకవర్గం డెవలప్ అవుతుందని పేర్కొన్నారు. “ఈ యుద్ధం పార్టీలకు మధ్య కాదు.. టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి, మునుగోడు ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. కుటుంబ పాలనను అంతమొందించే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధం’’ అని అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్​పై ఈ తీర్పు ఆధారపడి ఉందని చెప్పారు. కేసీఆర్ నియంత పాలనకు బుద్ధి చెప్పే ఎన్నిక అవుతుందని పేర్కొన్నారు. పార్టీ మారొద్దంటూ రాజగోపాల్​రెడ్డిని శనివారం ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కోరారు.

జూబ్లీహిల్స్​లోని రాజగోపాల్​ ఇంట్లో ఆయనతో సుమారు గంటన్నరపాటు సమావేశమై చర్చించారు. “పార్టీ మార్పుపై తొందర పాటు నిర్ణయం తీసుకోవద్దు. రాహుల్ మాటగా ఢిల్లీకి రావాలి” అని ఉత్తమ్ , వంశీచంద్  కోరారు. అయితే  నేతల విజ్ఞప్తులను రాజగోపాల్ రెడ్డి తిరస్కరించినట్లు తెలుస్తున్నది. భేటీ అనంతరం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో, ఆ తర్వాత మునుగోడు పర్యటనలో రాజగోపాల్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. డెవలప్ మెంట్ అంతా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే పరిమితమైందని, మిగతా నియోజకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మూడున్నరేండ్లుగా తాను అడిగినా ఇవ్వని గట్టుప్పల్ మండలాన్ని బైపోల్ అని ముందుకు వస్తే ఆగమేఘాల మీద ప్రకటించటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకునేందుకు అవినీతి డబ్బుతో, ప్రలోభాలతో మునుగోడు ప్రజలను టీఆర్​ఎస్​ మభ్యపెడుతున్నదని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక అంశం కేసీఆర్ సృష్టించిందేనని, వరదలతో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే బై ఎలక్షన్ డ్రామా ఆడుతున్నారని ఫైర్​ అయ్యారు.  కాంగ్రెస్ లో కొనసాగుతూ అవమానాలు భరించలేనని రాజగోపాల్ అన్నారు. ‘‘మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. పదవులు, కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నట్లు నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. డబ్బులు, పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు” 
అని చెప్పారు. 

నియోజకవర్గంలో పర్యటన
మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్​రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. తన భవిష్యత్​ కార్యాచరణపై మూడు రోజుల పాటు పార్టీ కేడర్, తన అనుచరులతో హైదరాబాద్​లో చర్చలు జరిపిన ఆయన ఇప్పుడు ప్రజల వద్ద అభిప్రాయాలు తీసుకునేందుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శనివారం చౌటుప్పల్​ మున్సిపాలిటీలో, మునుగోడు మండలంలో  పర్యటించారు. చౌటుప్పల్​లో ఏడాది కింద తల్లిని కోల్పోయిన పాపకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, ఆ పేపర్లు అందజేశారు. అనంతరం దెబ్బతిన్న చౌటుప్పల్-నారాయణపురం రోడ్డును పరిశీలించారు. చౌరస్తాలో అందరితో కలిసి టీ తాగుతూ తన భవిష్యత్​ కార్యాచరణపై అభిప్రాయాలు అడిగితెలుసుకున్నారు. 

రాజగోపాల్​ కాంగ్రెస్​లోనే ఉంటరు: వంశీచంద్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​లోనే ఉంటారని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి అన్నారు. శనివారం రాజగోపాల్ రెడ్డితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘‘రాజగోపాల్​రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తరు? ప్రతి నెల రెండు సార్లు ఆయనతో కలుస్తుంటాను.. మాట్లాడుతుంటాను. కేసీఆర్​తో యుద్ధం చేయటానికి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు,  మేధావులు రెడీగా ఉన్నరు. ఏ కలల కోసం తెలంగాణ సాధించుకున్నామో.. అవి నెరవేరటం లేదు కాబట్టి అందరూ కేసీఆర్ మీద యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నరు” అని పేర్కొన్నారు.