మునుగోడును దత్తత తీసుకోండి .. కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడును దత్తత తీసుకోండి .. కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు( గట్టుప్పల్​), వెలుగు: మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని, అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్ మండలంలో ఇంకా కొన్ని గ్రామాలను చేర్చాల్సి ఉందని, అలాగే మండలంలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు లేవని తెలిపారు. ప్రత్యేకించి విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇవ్వడం చరిత్రాత్మకమని కొనియాడారు.  నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని కోరారు.

 కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రేషన్ కార్డులు రానివారు దరఖాస్తు చేసుకుంటే  విచారణ జరిపి, మంజూరు చేస్తామన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 12లోగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, స్థానిక సంస్థల ఇన్​చార్జి అడిషనల్​కలెక్టర్ నారాయణ అమిత్, కాంగ్రెస్ నాయకులు నామని జగన్నాథం, వీరమల్ల శ్రీశైలం, కంచుకట్ల సుభాష్, రావుల రమేశ్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.