రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిస్త

రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిస్త
  • రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిస్త : ఎమ్మెల్యే రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తే లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ నియంత పాలనకు చరమ గీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి సమరశంఖం పూరిస్తానని చెప్పారు. సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో తాను పోరాటం చేయడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని మునుగోడు ప్రజలు  స్వాగతిస్తున్నారని అన్నారు. త్వరలో మరింత విస్తృత సంప్రదింపులు జరిపి టీఆర్ఎస్‌‌పై యుద్ధానికి దిగుతానన్నారు. వందల కోట్ల డబ్బులతో వస్తున్న కేసీఆర్ వందిమాగధులు, ఆయన సేనను ఎదిరించి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మునుగోడు వేదికగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.

అభివృద్ధిని నిలిపేసిండు
గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో మునుగోడును అభివృద్ధి చేస్తామంటే రాజీనామా చేస్తానని తాను రెండేండ్ల కిందటే చెప్పానని రాజగోపాల్‌‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను అందరికీ ఇస్తే రాజీనామా చేస్తానని ఏడాది కిందే ప్రకటించానన్నారు. తెలంగాణని సొంత కుటుంబ ఆస్తిగా మార్చుకొని ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్‌‌‌‌పై యద్ధ ప్రకటన త్వరలో చేయబోతున్నానని అన్నారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసే కేసీఆర్.. ఉద్దేశపూర్వకంగానే తన నియోజకవర్గంపై కక్ష కట్టారని ఆరోపించారు. మూడున్నరేండ్లుగా తనను, నియోజకవర్గ ప్రజల్ని అవమానపరిచి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. 

నియోజకవర్గంలో పాదయాత్ర
రాజగోపాల్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్‌‌లో, సాయంత్రం మునుగోడులో పర్యటిస్తారు. ఆదివారం హైదరాబాద్‌‌లో ఉంటారు. తిరిగి సోమవారం మాల్-మర్రిగూడలో ప్రజలను కలుస్తారు. ప్రతి చోట రెండు, మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.