
హాలియా, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం త్రిపురారం మండల కేంద్రంలోని సుశీల ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నిరుపేదలందరికీ సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం నిడమనూరు మండలం గుంటిపల్లిలో అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి, హాలియా, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, అంకతి సత్యం, తహసీల్దార్ ప్రమీల, మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు అనుముల శ్రీనివాస్ రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.