
మెదక్ (శివ్వంపేట), వెలుగు : సొంత జాగలో ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం త్వరలో రూ.3 లక్షల ఇవ్వనుందని, సీఎంతో మాట్లాడి మరో రూ.2 లక్షలు ఇప్పించే విధంగా కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శనివారం శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన జరిగిన మండల జనరల్ బాడీ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ స్కీం కింద తాగునీటి కోసం శివ్వంపేట మండలానికి గోదావరి, మంజీరా జలాలు సరఫరా కానున్నాయన్నారు. నియోజకవర్గంలో రోడ్లకు, పంచాయతీ బిల్డింగ్లకు రూ.85 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాల సర్పంచ్లు విద్యుత్ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొంతన్ పల్లి, దంతాన్ పల్లి గ్రామ సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, దుర్గేశ్మాట్లాడుతూ తమ గ్రామాల్లో స్ట్రీట్ లైట్లకు కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ సొంత డబ్బులతో పనులు చేయించుకుంటున్నామన్నారు. బోజ్యా తండా సర్పంచ్ రాజు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాన నివాసం ఉంటున్న గుడిసె కాలిపోయిందన్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని నాలుగేళ్లుగా ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో అడిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.