దళారుల ప్రమేయం లేకుండా విశ్వకర్మ పథకం

దళారుల ప్రమేయం లేకుండా విశ్వకర్మ పథకం

ఆదిలాబాద్, వెలుగు: దళారుల ప్రమేయం లేకుండా పీఏం విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ రుణాలు అందిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల వృత్తుల దారులకు ఉపాధి కల్పించాలని గొప్ప ఆలోచనతో ప్రధాని మోదీ.. పీఎం విశ్వ కర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 

ఆన్​లైన్​లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ద్వారా కేంద్రానికి పంపిస్తామని, ఆ తర్వాత కేంద్రం నేరుగా లబ్ధిదారుల అకౌంట్​లో నగదు జమచేస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ నియోజకవర్గ అభి వృద్ధి కోసం రు.10 కోట్ల సీఆర్ఆర్ గ్రాంట్​తో పాటు మరో రూ.4  కోట్లు ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు సన్మానించారు.

ఆలయ అభివృద్ధికి కృషి..

బేల మండల కేంద్రంలోని పురాతనమైన మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆలయాన్ని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. అంతకుముందు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.