బీఆర్ఎస్​కు మరో బిగ్ ​షాక్..కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి

బీఆర్ఎస్​కు మరో బిగ్ ​షాక్..కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి
  • కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్​రెడ్డి
  • భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తం: సీఎం
  • రైతుల కోసమే కాంగ్రెస్​లో చేరిన: పోచారం
  • త్వరలో కాంగ్రెస్​లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : దానం 

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​కు మరో బిగ్​షాక్​ తగిలింది. ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. పోచారం కొడుకు, నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితోపాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్​లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్.. ఆయనతోపాటు కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం పోచారం, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుడు, రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పోచారం శ్రీనివాస్​రెడ్డి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అవసరమని భావించి, ఆయనను పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరగానే సానుకూలంగా స్పందించారని తెలిపారు.

బాన్సువాడ అభివృద్ధితోపాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.  రైతు రుణ మాఫీ, రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీనివాస్​రెడ్డి పార్టీలోకి రావడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం పెద్దలందరి సలహాలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు.

రైతు సంక్షేమం కోసమే : పోచారం 

రైతు సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని పోచారం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. తన జీవితం రైతులకే అంకితమని పేర్కొన్నారు. ‘రేవంత్ రైతు పక్షపాతి, రైతుల కోసం పాటుపడే వ్యక్తి. రైతు అనుకూల పనులు చేస్తున్న సీఎంను చూసి ఒక రైతు బిడ్డగా గర్విస్తున్నా’ అని అన్నారు. యువకుడైన రేవంత్​కు మరో 20 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా  ఉందని పోచారం చెప్పారు.

గ్రేటర్​లో బీఆర్ఎస్​ ఖాళీ అవుతుంది: దానం 

బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే  కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘పోచారం ఒక్కరే కాదు, రాష్ట్రంలో, గ్రేటర్​లో ఇక బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయం’ అని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు మూడు  రోజులుగా చర్చించి, చేరికలపై ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పారు. కేటీఆర్​, హరీశ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు.

హరీశ్​తోపాటు మరి కొందరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే ఎమ్మెల్యేల్లో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్​లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

పోచారం బాటలో లక్ష్మారెడ్డి

బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా పోచారం బాటలోనే త్వరలో కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని లక్ష్మారెడ్డి కలిశారు. మర్యాద పూర్వక భేటీ అని చెప్తున్నా.. త్వరలోనే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.