మునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చండూరు, వెలుగు : విద్యుత్ పనుల అభివృద్ధి కోసం రూ.34 కోట్లు మంజూరు చేసి మునుగోడును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్​ను కోరారు. హైదరాబాద్ లోని టీజీ ఎస్పీడీసీఎల్​రాష్ట్ర కార్యాలయంలో నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై సీఎండీ, ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోని లో వోల్టేజీ సమస్య, అదనపు ట్రాన్స్ ఫార్మర్ల  కేటాయింపు, సబ్ స్టేషన్ల నిర్మాణం, లూజు లైన్ల సమస్యను అధికారులు.. సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

విద్యుత్​సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి, నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను సీఎండీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని, ఆ సంస్కరణలను మొదట మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమవుతున్నాయని తెలిపారు.

విద్యుత్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వహించడం సరికాదన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు  పాల్గొన్నారు.