
చండూరు, వెలుగు: కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో షాపులకు టెండర్లు వేసే వారికి సోమవారం కొత్త రూల్స్ పెట్టారు. తాను గెలవగానే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. తాజాగా కొత్తగా లిక్కర్ షాపులు తీసుకునేవారు తన సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో ఊరి బయట మాత్రమే వైన్ షాపులను పెట్టుకోవాలని, సిట్టింగ్ లేకుండా చూసుకోవాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారొద్దని , మద్యాన్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే విక్రయించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని, యువత మద్యానికి బానిసలు కాకూడదనేదే తన ఆరాటమన్నారు. ఇంటి యజమాని తాగకుండాఉంటే మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తారన్నారు.
గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు తాగుడుకు బానిసైన యువత విచక్షణారహితంగా ప్రవర్తించడం చూశానని, 30 ఏళ్లలోపు వారు తాగుడుకు బానిసై చనిపోతే చిన్న వయసులో భర్తను కోల్పోయి అనేక మంది మహిళలు రోడ్డున పడ్డారని, అందుకే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే సూచనతో చండూరు, నాంపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు సోమవారం నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.