‘బెల్టు షాపులు మనోళ్లవే.. వాటి జోలికెళ్లొద్దు’ ఎస్ఐకి ఎమ్మెల్యే హెచ్చరిక 

‘బెల్టు షాపులు మనోళ్లవే.. వాటి జోలికెళ్లొద్దు’ ఎస్ఐకి ఎమ్మెల్యే హెచ్చరిక 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని యంపిడిఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యే రాములు నాయక్ నోరు జారారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆయన వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మండలంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ,ఎంపీటీసీలు హాజరయ్యారు. మండలంలో పోలీసులు బెల్టు షాపులను టార్గెట్ చేస్తున్నారని జడ్పీటీసీ ఎమ్మెల్యేకు చెప్పారు. దాంతో ఎమ్మల్యే రాములు నాయక్.. అదే సమావేశంలో ఉన్న ఎస్ఐని పిలిచి ‘బెల్టు షాపులు మనవాళ్లవే.. వాటి జోలికెళ్లోద్దు’ అంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా దెబ్బకు ఒక పక్క బడులే బంద్ చేస్తే.. బెల్టుషాపుల జోలికి పోవద్దని ఒక ఎమ్మెల్యే చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. ఇళ్ల చుట్టూ బెల్టుషాపులు ఉండటం వల్ల బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చిన్నతనం నుంచే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారని వాపోయారు. బెల్టు షాపులను అరికట్టి స్థానిక ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే.. బెల్టుషాపులను ప్రోత్సహించడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మద్యం లభించడం వల్ల పచ్చని సంసారాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.