
మెదక్‌టౌన్, వెలుగు: పల్లెల ప్రగతి కోసమే పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే రోహిత్‌రావు చెప్పారు. శుక్రవారం మెదక్ మండల పరిధిలోని బాలానగర్ జీపీ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అన్ని వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూడాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. 31వ వార్డులో మున్నూరు కాపు సంఘానికి రూ.10 లక్షలు, మైనారిటీ హాల్‌కు రూ.10 లక్షలు, రజక సంఘానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ శ్రీనివాస్ రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు శేఖర్, రుక్మిణి, లక్ష్మీ, నాయకులు పవన్, మనోజ్‌కుమార్, కృష్ణ, మధుసూదన్ రావు, ఆంజనేయులుగౌడ్, ముత్యంగౌడ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన కలెక్టర్
తూప్రాన్: గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పనుల జాతరకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తూప్రాన్ మండల పరిధి ఇస్లాంపూర్, వెంకట రత్నాపూర్ గ్రామాల్లో డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇస్లాంపూర్ లో రూ.3 లక్షల అంచనా వ్యయంతో సామూహిక మరుగుదొడ్లను, వెంకట రత్నాపూర్ లో రూ.92 వేలతో నిర్మించే పశువుల పాకను, రూ.20 లక్షలతో నిర్మించే జీపీ భవన సముదాయం పనులను ప్రారంభించారు.
అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ.20.60 కోట్ల వ్యయంతో 3,238 పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వెంకటరత్నాపూర్ లో కలెక్టర్ స్వయంగా పొలానికి నానో యూరియా పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఉన్నారు.