
అచ్చంపేట, వెలుగు : యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను హెచ్చరించారు. బుధవారం అచ్చంపేటలోని క్యాంప్ కార్యాలయంలో సింగిల్ విండో, అగ్రికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా యూరియా తీసుకొచ్చే విధంగా సింగిల్ విండో అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
కొందరు వ్యాపారులు అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో సర్జికల్ క్యాంపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సమావేశంలో అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రజితామల్లేశ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఏవో కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.