
- ఆ తర్వాతే వర్గీకరణ చేపట్టాలి.. తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- జనాభా పెరిగినా.. పాత లెక్కలతో రిజర్వేషన్లు ఇస్తున్నరు
- మాలలు ఐక్యంగా హక్కులను సాధించుకోవాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లలో వాటా పెంచి.. ఆ తర్వాత వర్గీకరణ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఇతర వర్గాలలో లేని రిజర్వేషన్ల వర్గీకరణ ఎస్సీలలోనే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎస్సీల జనాభా పెరిగిందని.. అయినా, 2011 జనాభా లెక్కలతోనే రిజర్వేషన్లు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభ జరిగింది. ఈ సభకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘దళితులను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారు. విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని పార్టీల నాయకులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో హక్కులను కాపా డుకోవడానికి మాలలంతా ఏకతాటిపైకి రావాలి.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో మీటింగులు నిర్వహించి మాలలను ఐక్యం చేశాం. ఆ తర్వాత మాలలకు ధైర్యం వచ్చింది. అనంతరం లక్షల మందితో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ‘మాలల సింహ గర్జన’ మీటింగ్
పెట్టుకున్నం. ఆ సభ స్పాన్సర్డ్ మీటింగ్ కాదు. సొంత ఖర్చులతో మీటింగ్‌కు వచ్చారు. దేశంలో ఒక కులం మీటింగ్ అంతటి భారీ ఎత్తున ఈ మధ్య ఎక్కడా జరగలేదు”అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్సులు, జీవోలు తెచ్చారని.. వాటి వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని తాము పోరాడుతున్నామని వివేక్అన్నారు. మాలలకు సరైన వాటా కోసం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు పెంచితేనే మాలలకు సరైన వాటా, ప్రాతినిథ్యం వస్తుందని అన్నారు.
అందుకోసం ఏపీలో కూడా కొట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసినప్పుడు.. దళితుల సంఖ్యకు తగ్గట్టు వాటా పెంచి.. ఆ తర్వాతే వర్గీకరణ అమలు చేశారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో కూడా వాటా పెంచాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా స్పష్టంగా చెప్పానని అన్నారు. తెలంగాణ, ఏపీలో కూడా ఎస్సీ రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‘‘అసెంబ్లీలో మాట్లా డితేనో, మీటింగ్‌లు జరిగితేనో న్యాయం జరగదు.
అందరం ఐక్యంగా కలిసి పోరాడితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే అణచివేతకు గురవుతాం. మాలల సమస్యల గురించి మాట్లాడితే మా పార్టీలో చాలా మంది నన్ను సస్పెండ్ చేయమని డిమాండ్ చేశారు. కానీ, నా జాతి కోసం ఎంతవరకైనా పోరాడుతానని స్పష్టం చేశాను. మన పిల్లల భవిష్యత్తు మన పోరాటం మీదనే ఆధారపడి ఉంటుంది”అని వివేక్ అన్నారు.
ఏపీలో మాలలకు నాయకత్వం అవసరం
ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కులం మాల కులమని.. వారంతా హక్కుల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సత్తా చూపించాలన్నారు. ‘‘ఏపీలో మాలల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి మీటింగ్‌లలో అందరూ పాల్గొని.. ప్రభుత్వాలకు బలమైన మెసేజ్ పంపాలి. అప్పుడే మాలలకు అన్యాయం చేయవద్దు అని ప్రభుత్వాలు భావిస్తాయి. నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది”అని అన్నారు. ప్రజల్లో స్పందన ఉన్నప్పుడే నాయకత్వం వస్తుందని చెప్పారు. మాలలు చాలా అసోసియేషన్లు పెట్టుకుని ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారని, అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగింది: రెడ్డప్ప
ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగిందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు. వర్గీకరణ వలన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. దళితుల కోసం కొట్లాడిన వారిలో అంబేద్కర్ తరువాత కాకా వెంకటస్వామి గుర్తుకు వస్తారని అభిప్రాయపడ్డారు. వివేక్ విద్యావేత్త, వ్యాపార వేత్త అని.. రాజకీయాలలో నిస్వార్థ సేవాపరుడు అని కొని యాడారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉన్న నేత వివేక్ అని పేర్కొన్నారు.
ఆర్థికంగా ఎదిగేందుకు వర్గీకరణ కావాలి: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ఎస్సీ వర్గీకరణ ఉద్యోగాల కోసం అంటున్నారని.. కానీ, వర్గీకరణ కావాల్సింది బ్యాంకు లోన్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇసుక రీచ్‌లలో అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ప్రతి ఏటా లక్షల కోట్లు లోన్లు ఇస్తున్నారని, దేశంలో 25 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉంటే 1 శాతం లోన్లు ఇస్తున్నారని.. ఇది చాలా బాధాకరమన్నారు. కాంట్రాక్టర్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నాటకలో 25 శాతం ఎస్సీ, ఎస్టీలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నదనని.. అక్కడ ఇచ్చినట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌ను, ఏపీ సీఎం చంద్రబాబును చింతామోహన్ కోరారు.
ఎస్సీ, ఎస్టీల బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదు
ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, 30 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతాయని.. కానీ, బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయవని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. ‘‘ఎస్సీలకు, ఎస్టీలకు 25 శాతం బడ్జెట్ ఇస్తామని చెప్పి.. బడ్జెట్‌ను డైవర్ట్ చేస్తున్నారు. దళితులు నోరు విప్పడం లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది.
కొట్లాడినప్పుడే ఆర్థికంగా పైకివచ్చి కుల వివక్ష పోతుంది”అని వివేక్ అన్నారు. రిజర్వేషన్లతో బెనిఫిట్ పొందినవారు ప్రత్యేక ఆర్గనైజేషన్లుగా ఏర్పడాలని.. ఒక్కో ఉద్యోగి పది మందికి సహాయం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. అందరినీ ప్రయోజకులను చేయాలని సూచించారు. తమ తండ్రి వెంకటస్వామి కూడా అప్పట్లో దళితులందరి కోసం కొట్లాడారని గుర్తుచేశారు.