ముందు కవిత పరామర్శకు వెళ్లండి: యశస్విని రెడ్డి

ముందు కవిత పరామర్శకు వెళ్లండి: యశస్విని రెడ్డి

పాలకుర్తి, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పొలంబాట మానేసి లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఊచలు లెక్కపెడుతున్న కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి విమర్శించారు. దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో కేసీఆర్​ఎండిపోయిన పంటలను పరిశీలించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆమె మండిపడ్డారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్​చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్య లేదని ఒకే చోట అర ఎకరంలో రైతుకు గ్రౌండ్ వాటర్ సరిపడా లేక సత్తెమ్మ పొలం ఎండిపోయిందని, బీఆర్ఎస్​నాయకులు అదే పొలాన్ని పదేపదే సందర్శిస్తూ టూరిస్ట్ స్పాట్ గా మార్చారని మండిపడ్డారు.

దయాకర్ రావు, హరీశ్ రావు, కేసీఆర్ పదిరోజుల వ్యవధిలో ఆ పొలాన్ని సందర్శించిడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ పరిశీలించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేసినా నీళ్లు రాలేదని, పక్కనే ఉన్న మరో రైతు పొలంలోని బోరులో నీరు వస్తున్నదని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదో ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పాలని ప్రశ్నించారు. ఫామ్ హౌస్​నుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు పొలంబాట పట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు జైలుకు వెళ్లబోతున్నారని, ఆ ఫ్రస్ట్రేషన్​లో రైతులను అడ్డుపెట్టుకొని పొలిటికల్ షోలు చేస్తున్నారని మండిపడ్డారు.