
పాలమూరు, వెలుగు: విద్యా నిధికి వచ్చే ప్రతి పైసా నియోజకవర్గంలోని పేద పిల్లల కోసమే ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ హీరో మహేశ్ బాబు అభిమానులు విద్యా నిధికి రూ.25 వేలు అందజేశారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి, మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు రమేశ్ బాబు, మునీశ్వర్, మధు ప్రవీణ్, వంశీకృష్ణ, శివరాం పాల్గొన్నారు.
వేలాది మందికి ఉద్యోగాలు..
మహబూబ్ నగర్ రూరల్: అమరరాజ కంపెనీతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎదిర ఐటీ పార్క్ ఆవరణలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 3వ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అమరరాజ కంపెనీ, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో నైపుణ్య శిక్షణ ఉచితంగా అందజేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ పాల్గొన్నారు.