మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు మహిళలు అత్మవిశ్వాసానికి నిదర్శనమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీకే రెడ్డి కాలనీలోని మహబూబ్‌నగర్ ఫస్ట్ సెంటర్లో శుక్రవారం ఎమ్మెల్యే తన సొంత నిధులతో నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ ఫస్ట్‌లో ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లలో వెయ్యి మంది శిక్షణ పొందారని తెలిపారు.
ఈ వెయ్యి మంది వివిధ రంగాల్లో స్థిర పడ్డారని, అలాగే వారు మరికొందరు మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలపరచడం తన సంకల్పమని తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ పాల్గొన్నారు.
