స్పీడ్​ పెంచిన ఎమ్మెల్యేలు.. కులసంఘాలకు నజరానాలు, దావత్లు

స్పీడ్​ పెంచిన ఎమ్మెల్యేలు.. కులసంఘాలకు నజరానాలు, దావత్లు

  నెట్​వర్క్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో హడావుడి మొదలైంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టారు. నిత్యం ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలతో బిజీగా మారారు. ఊర్లల్లో జనాల్ని సమీకరిస్తూ గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపడుతున్నారు. కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయడంతో పాటు ఆయా కులపెద్దలను మచ్చిక చేసుకునేందుకు నజరానాలు ప్రకటిస్తున్నారు. గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటినుంచే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు నియోజకవర్గాల్లో 

ఎమ్మెల్యేలు విస్తృతంగా తిరిగారు.

 ఖమ్మం సిటీలోని పలు డివిజన్లలో రూ.2.95 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్​లో స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్స్ నుంచి రూ.90 లక్షలతో  నిర్మించనున్న సీసీ డ్రైన్, 14, 16వ డివిజన్​లలో ఎల్ఆర్ఎస్ నిధులతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 30న ఖమ్మంలో పర్యటించనున్న కేటీఆర్ రూ.1200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి పువ్వాడ ప్రకటించారు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్​లో రూ.80 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనుల కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. గుండాల మండలం కాచనపల్లి వద్ద డీఎంఎఫ్​టీ ఫండ్స్ నుంచి రూ.70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.
 
పెద్దపల్లిలో రూ.1.25 కోట్లతో నిర్మించనున్న జిల్లా లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. మంథనిలో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి ప్రొసీడింగ్స్ అందజేశారు.
 
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో రూ.6.17 కోట్లతో నిర్మించే రోడ్డు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే రవిశంకర్ శంకుస్థాపన చేశారు.  
 
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో పద్మశాలి, బెస్త కులాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్‌‌ భూమిపూజ చేశారు. మండలంలో ప్రజా అంకిత యాత్ర చేపట్టారు. బండల వాగు ప్రాజెక్ట్‌‌ను ఎల్లంపల్లి నీటితో నింపుతానని హామీ ఇచ్చారు.
 
జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు 763 మం ది గృహలక్ష్మి లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే సం జయ్ కుమార్ ప్రొసీడింగ్స్ అందజేశారు. మరో 59 మందికి కల్యణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులిచ్చారు. 
 
వరంగల్​లో రూ.4.16 కోట్లతో నిర్మించిన ఎం డోమెంట్ డిపార్ట్​మెంట్ ఆఫీసు ధార్మిక భవన్​ను గురువారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. 
 నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని జక్కల వారి గూడెం ప్రైమరీ స్కూలు కొత్త భవనాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. పలివెలలో రూ.1. 70 కోట్లతో చేపట్టే సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
 
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే రవీందర్​కుమార్ ​పంపిణీ చేశారు.
 
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్, నాగారం, జాజిరెడ్డిగూడెం, మధిరాల మండలాల్లో  గృహలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రొసీడింగ్స్ అందించారు. కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలంలో 35 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి షాద్ ముబారక్, మరో ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంచారు.
 
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బోమ్మన్ దేవపల్లిలో పలు అభివృద్ధిపనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో పోచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

 ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లోని 1200 గణేశ్ ​మండపాలకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి కుమార్తె దీపిక గురువారం రూ.10 వేల చొప్పున రూ.12 లక్షల విరాళాలు ఇచ్చారు. గురువారం ఆమె స్వయంగా మండపాల దగ్గరకు వెళ్లి ఉత్సవ కమిటీలకు డబ్బులు అందజేశారు. 

మీట్ అండ్​ ట్రీట్!

వెలుగు, సూర్యాపేట : సూర్యాపేటకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలతో హైదరాబాద్​లో మంత్రి జగదీశ్​ రెడ్డి వరుస సమావేశం అవుతున్నారు. ఒక ప్రముఖ రియల్టర్​కు చెం దిన హోటల్​లో దావత్ ఏర్పాటు చేసి బుజ్జగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అంశం తెరమీదికి వచ్చింది. కొద్దిరోజుల కింద రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో రెడ్డి జాగృతి సంఘం నాయకులు హైదరాబాద్​లోని మినిస్టర్ క్వార్టర్స్​లో జగదీశ్ ​రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో మంత్రికి, రెడ్డి జాగృతి సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రెడ్డి కార్పొరేషన్​కు మద్దతు ఇస్తున్నట్లు మంత్రి జగదీశ్​ రెడ్డి ప్రకటించాలనే డిమాండ్​తో క్వార్టర్స్ ముందే ధర్నాకు దిగిన నాయకులను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగదీశ్​రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తామని రెడ్డి జాగృతి నేతలు హెచ్చరించడంతో అలర్ట్ అయిన మంత్రి రెడ్డి సామాజిక వర్గాన్ని బుజ్జగించే పనిలో పడినట్లు, అందులో భాగంగానే భేటీలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

  ములుగులో వ్యవసాయ శాఖ కొత్త ఆఫీసును గురువారం మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఇంచర్ల గట్టమ్మ దగ్గర గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రూ.5 కోట్లతో నిర్మించనున్న  అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మేడారంలో రూ.12 కోట్లతో చేపట్టే జాతర అభివృద్ధి పనులను ప్రారంభించారు.

  జనగామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండలాలకు చెందిన 290 మంది బీసీ కులాల చేతి వృత్తుల వారికి లక్ష చొప్పున  రూ.2.90 కోట్ల విలువైన చెక్కుల‌ను మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పంపిణీ చేశారు.