సారయ్య వెంట ఇంకెవరు ?

సారయ్య వెంట ఇంకెవరు ?
  •     ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌లో చేరిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
  •     మిగిలిన ఎమ్మెల్సీల కదలికలపై అనుమానాలు
  •     ఉమ్మడి వరంగల్‌‌‌‌ నుంచి మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ మారుతారని ప్రచారం

వరంగల్‍, వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌‌‌‌ నేత అయిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనూహ్యంగా కారు వదిలి కాంగ్రెస్‌‌‌‌ కండువా కప్పుకోవడం జిల్లాలో హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారింది. జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క కలిసి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఆఫీసర్లతో గురువారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన రివ్యూకు ఎమ్మెల్సీ బస్వరాజ్‌‌‌‌ సైతం హాజరయ్యారు. 

అనంతరం అదే రోజు రాత్రి ఎమ్మెల్సీలు దండే విఠల్‍, భానుప్రసాద్‌‌‌‌రావు, బుగ్గారపు దయానంద్‍, ప్రభాకర్‌‌‌‌రావు, ఎగ్గె మల్లేశంతో కలిసి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్‍ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్‌‌‌‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరడంతో అంతా షాక్‌‌‌‌కు గురయ్యారు. కేసీఆర్‌‌‌‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సారయ్య కాంగ్రెస్‌‌‌‌లో చేరడంతో ఇప్పుడు ఆయన వెంట ఇంకా ఎవరెవరు వెళ్తారనే చర్చ జోరుగా సాగుతోంది. 

అవమానాలెదురైనా పార్టీ లైన్‌‌‌‌ దాటలే.. 

రజక సామాజికవర్గానికి చెందిన బస్వరాజ్‌‌‌‌ సారయ్యకు సౌమ్యుడిగా పేరుంది. గతంలో కాంగ్రెస్‌‌‌‌ హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌‌‌‌ను వీడి బీఆర్‍ఎస్‌‌‌‌లో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌‌‌‌కు సన్నిహితుడిగా మెదిలాడు. సారయ్యను కేసీఆర్‍ ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లా ఇన్‌‌‌‌చార్జిగా నియమంచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 

అయితే సారయ్య తన సొంత నియోజకవర్గమైన వరంగల్‍ తూర్పు నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍తో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ బయట ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఫ్లెక్సీలను సొంత పార్టీ నేతలే చించివేయించినా, ఆయన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించినా సారయ్య మాత్రం ఏనాడు పార్టీ లైన్‌‌‌‌ దాటలేదు. వివాదరహితుడిగా కేసీఆర్‍తో సఖ్యతగా ఉన్నారు. 

సారయ్య దారిలో మరో ఇద్దరు ?

వరంగల్‌‌‌‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బస్వరాజు సారయ్య మాత్రం ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. పార్లమెంట్‍ ఎన్నికల టైంలో సారయ్య రాజకీయ గురువైన రామసాయం సురేందర్‍రెడ్డికి కాంగ్రెస్‍ పార్టీ ఖమ్మం టిక్కెట్‌‌‌‌ కేటాయించడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వారం రోజుల కింద సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ పర్యటన, హైదరాబాద్‌‌‌‌లో రివ్యూకు హాజరయ్యే వరకు సారయ్య పార్టీ మార్పు ఖాయమని ప్రచారం జరుగగా దానిని కొట్టి పారేశారు. 

చివరకు అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌‌‌‌ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వెంట ఇంకా ఎవరెవరు కాంగ్రెస్‌‌‌‌లో చేరుతున్నారనేది ఆసక్తిగా మారింది. ఓరుగల్లులో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండగా కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‍రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. సారయ్యతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా ప్రకాశ్‍, సిరికొండ మధుసూదనచారి, మాజీమంత్రి సత్యవతి రాథోడ్‍, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‍రావు మిగిలారు. 

నిన్నమొన్నటి వరకు పార్టీ మారేవారిలో సారయ్యతో పాటు బండా ప్రకాశ్‍, తక్కళ్లపల్లి రవీందర్‍రావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సారయ్య తరహాలోనే వారు సైతం ప్రచారాన్ని ఖండించారు. సీఎం వరంగల్‍ పర్యటనలో బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్సీల్లో సారయ్యతో పాటు బండా ప్రకాశ్‍ పాల్గొనగా, గురువారం నిర్వహించిన రివ్యూకు వారిద్దరితో పాటు పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి సైతం హాజరయ్యారు. సారయ్య ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌లో చేరడంతో అందరి చూపి మిగతా ఇద్దరిపై పడింది. ఎమ్మెల్సీల కదలికలపై పార్టీ పెద్దలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గులాబీ లీడర్లు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.