
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ లోని నాగోబాను ఎమ్మెల్సీ దండే విఠ్ఠల్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్సీ హమీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కేస్లాపూర్ లో ఆదివాసీల దైవం నాగోబ విగ్రహ ప్రతిష్ఠాపన తెల్లవారుజామున సంప్రదాయ పూజలతో జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్దఎత్తున ఆదివాసీలు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ నెల 12 నుంచి నిత్యపూజలు, అన్నదానం భజన కార్యక్రమాలను నిర్వహించారు. జనవరిలో వచ్చే పుష్య అమావాస్యరోజు నాగోబా జాతర, అభిషేకం జరగబోతుంది.
కొత్తగా రాతితో నిర్మించిన తమ కుల దైవం ఆలయాన్ని చూసి ఆదివాసీలు ఎంతో సంబురపడుతున్నారు. 2017లో నాగోబా ఆలయం పునర్ నిర్మాణ పనులకు అంకురార్పణ చేయగా.. మెస్రం వంశస్తుల నిధులతోనే ప్రధాన ఆలయం, మండపం నిర్మాణం జరిగింది. 2011లో తమ ఆలయాన్ని తామే నిర్మించుకోవాలని సంకల్పంతో మెస్రం వంశస్తులు ఇంటికి కొంత జమ చేస్తూ వచ్చారు. అలా సేకరించిన రూ.5కోట్ల రూపాయలతో ఆలయాన్ని మెస్రం వంశస్థులే నిర్మించుకున్నారు. ఏపీలోని ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన ప్రత్యేక రాతితో.. ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరిగింది.