పైసలు ఫ్రీగా వస్తున్నయ్​.. ఓపిక పట్టాలె : ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం

పైసలు ఫ్రీగా వస్తున్నయ్​.. ఓపిక పట్టాలె : ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం

హైదరాబాద్‌, వెలుగు: ఫ్రీగా వచ్చే పైసల కోసం గొల్లకురుమలు ఓపిక పట్టాలని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మావోళ్లు(గొల్లకురుమలు) కూడా ఓపిక పట్టాలె. మనకు ఫ్రీగ వస్తున్నయ్ పైసలు. మనమేం ఖర్సు పెట్టి.. కష్టపడి తీసుకొస్తలేము.. మనకు వస్తున్నయ్​..’’ అని అన్నారు. ముఖ్యమంత్రి ఏం తక్కువ చేసిండని ప్రశ్నించారు. 

గొర్రెల పంపిణీ నగదు బదిలీ చేయాలంటూ ధర్నాల పేరుతో రాజగోపాల్‌‌‌‌ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని, కురుమగొల్లోళ్లను అడ్డం పెట్టుకొని తమాషా చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కులంలో చిచ్చుపెడితే మర్యాద దక్కదని హెచ్చరించారు. గొల్లకురుమలు ఏకతాటిపై ఉంటే మరింత న్యాయం జరుగుతుందని, ఇంకో రెండు సీట్లు పెరుగుతాయన్నారు.

గొల్లకురుమలకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు వేల మంది గొల్లకురుమల ఖాతాల్లో రూ.93 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని, ఉప ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌ రాకముందే చాలా మంది డబ్బు డ్రా చేసుకున్నారని తెలిపారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎక్కడా ఎన్నికల నిబంధనలు అతిక్రమించలేదన్నారు. గొల్లకురుమలు సీఎంలుగా చేసిన రాష్ట్రాల్లోనూ తెలంగాణలోలాంటి పథకాలు లేవన్నారు. గొల్లకురుమల ఆత్మగౌరవ భవనాలు రెడీ అయ్యాయని, రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.